సినిమా వాళ్ళకి రాజకీయాలపై మోజు ఎప్పటి నుంచో ఉంది. కానీ రాజకీయాలలో రాణించినవారు అతికొద్ది మంది మాత్రమే. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌ల స్పూర్తితో చాలామంది నటీనటులు రాజకీయాలలో ప్రవేశించారు.
కొందరు చేతులు కాల్చుకోగా, పవన్ కళ్యాణ్ వంటి మరికొందరు పట్టుదలగా శ్రమించి రాజకీయాలలో నిలద్రొక్కుకోగలిగారు. తాజాగా ప్రముఖ మరాఠీ, హిందీ, తెలుగు సినీ నటుడు షాయాజీ షిండే కూడా రాజకీయాలలో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
Also Read – జగన్ హెచ్చరికలను లైట్ తీసుకుంటే…. ఫినిష్!
ఆయన మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాను సినిమాలలో రాజకీయ నాయకుడుగా నటించానని, సమాజాసేవ కోసమే రాజకీయాలలో ప్రవేశిస్తున్నానని షాయాజీ షిండే చెప్పారు.
షాయాజీ షిండే పెద్దగా ఆశలు పెట్టుకోకుండా రాజకీయాలలోకి ప్రవేశిస్తే పర్వాలేదు. త్వరలోనే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక షాయాజీ షిండే వాటిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.
Also Read – ఎక్కడ తగ్గాలో కూటమిలో అందరూ నేర్చుకున్నట్లేనా?
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ, ఏక్‌నాధ్ షిండే నాయకత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కనుక షాయాజీ షిండే సరైన సమయంలో సరైన పార్టీనే ఎంచుకుని రాజకీయాలలో ప్రవేశించారని భావించవచ్చు. మరి రాజకీయాలలో ఆయన రాణిస్తారో చెయ్యి కాల్చుకుంటారో మున్ముందు తెలుస్తుంది.