allu-arjun-arrested-in-sandhya-theatre-issue

చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మద్యాహ్నం ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల సంధ్య థియేటర్లో అభిమానులతో కలిసి పుష్ప-2 స్పెషల్ షో చూసేందుకు అల్లు అర్జున్‌ వచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో పుష్ప-2 సినిమా చూసేందుకు భర్త, పిల్లలతో కలిసి వచ్చిన రేవతి అనే మహిళా నలిగి ఘటనా స్థలంలోనే చనిపోయింది. ఆమె 11 ఏళ్ళ కుమారుడు శ్రీతేజ్ కూడా ఆ తొక్కిసలాటలో స్పృహ తప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలుడిని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రిలో వెంటీలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉంది.

అల్లు అర్జున్‌, సంధ్య ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి మహిళా మృతి చెందిందని పిర్యాదు అందడంతో చిక్కడపల్లి పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి నోటీసులు పంపారు. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ కోర్టు విచారణ చేపట్టక మునుపే పోలీసులు అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!


అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన వార్త ‘వైల్డ్ ఫైర్’లా క్షణాలలో దేశమంతా పాకిపోయింది. దీంతో భారీ సంఖ్యలో అల్లు అర్జున్‌ అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుంటున్నారు. పుష్ప-2లో పుష్పరాజ్ పోలీసులను, రాజకీయనాయకులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ నిజజీవితంలో అల్లు అర్జున్‌ ఇటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు.