వైసీపి హడావుడి చూస్తే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుంది. టిడిపి-బీజేపీల పొత్తు కుదిరినప్పుడే “ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే ఆశ రోజురోజుకీ సన్నగిల్లిపోతోందంటూ…” జగన్ వైసీపి ఓటమిని ప్రకటించేశారు. పోలింగ్ మర్నాటి నుంచి వైసీపి నేతలు అన్యాయం, అక్రమం, మోసం, దగా… అంటూ ఆక్రోశిస్తూనే ఉన్నారు.
కానీ జూన్ 4న యావత్ దేశం ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి ఆశ్చర్యపోతుందని జగన్ చెప్పుకోగా, జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం అంటూ వైసీపి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. రెండు రకాలుగా మాట్లాడుతున్నది వైసీపి నేతలే. కనుక ఈ రెంటిలో ఏది నిజం?అంటే ‘రెండూ నిజమే’ అని వైసీపీ నేతలు చెపుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.
Also Read – షిప్ సీజ్ అయ్యింది…ఇక అసలు కథ మొదలయ్యింది…!
అంటే ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి చేయకపోయినా, రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసినా, ఎన్నికల సమయంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఈసీ ఎంత పక్షపాతంగా వ్యవహరించినా, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా,పోలీసులు కూడా టిడిపికే కొమ్ము కాస్తున్నా, గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వైసీపీ చెపుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.
ఇదే కనుక జరిగితే జగన్ చెప్పిన్నట్లు జూన్ 4న యావత్ దేశ ప్రజలు ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి నిజంగానే ఆశ్చర్యపోక తప్పదుగా?
Also Read – అక్రమాస్తుల కేసులు: మరక మంచిదే?
వైసీపి 5 ఏళ్ళ పాలనలో మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ఈ సమయంలో కూడా వైసీపి తగ్గేదేలే అంటూ కుట్రలు, డ్రామాలు చేసుకుపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కౌంటింగ్‌లో రసాభాస తప్పదని పేర్ని నాని ముందే చెప్పేశారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భవనాలకు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ తీగల బండిల్స్‌ను తెప్పించి పెట్టింది. కానీ జగన్ ప్రభుత్వం అమరావతిని వద్దనుకోవడంతో అవి ఈ 5 ఏళ్లుగా అక్కడే పడి ఉన్నాయి.
Also Read – సినీ పరిశ్రమకు ఏపీ ఒక ఆదాయ వనరేనా.?
ఇప్పుడు వాటిని హడావుడిగా అక్కడి నుంచి విశాఖలోని అచ్యుతాపురానికి ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు ద్వారా తరలిస్తోంది! జగన్ చెప్పుకుంటున్నట్లు ఒకవేళ మళ్ళీ వైసీపియే గెలిచి ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపడతారనుకుంటే, ఇప్పుడు హడావుడిగా వాటిని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఏముంది?
ఒకవేళ ఓడిపోతున్నామని భావిస్తున్నట్లయితే ఇంత హడావుడిగా ఇప్పుడు వాటిని అక్కడి నుంచి ఎందుకు తరలిస్తున్నట్లు?
వైసీపి మరో కొత్త డ్రామా కూడా మొదలుపెట్టింది. విశాఖ శివారులో రెండు ఎకరాల విస్తీర్ణంలో 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వైసీపి కార్యాలయం నిర్మించుకుంది. జూన్ 9వ తేదీన జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయగానే, విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తారని వైసీపి నేతలు చెప్పుకుంటున్నారు.
కనుకనే విశాఖలోనే వైసీపి ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, కనుక ప్రతిపక్ష పార్టీలు కూడా విశాఖకు తరలిరాక తప్పదని చెపుతున్నారు. వైసీపి నేతలు చేస్తున్న ఈ హడావుడి చూస్తుంటే, ‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుంది కదా?