Amaravati To Podili: Everything is Planned

ఆంధ్రాలో వైసీపీ చేస్తున్న రాజకీయాలను నిశితంగా గమనిస్తే ఒక నిర్ధిష్టమైన వ్యూహం ప్రకారం సాగుతున్నట్లు అనిపిస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని జగన్‌ నిత్యం దూషిస్తూనే ఉన్నారు. సొంత మీడియా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇవి సరిపోవన్నట్లు తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు.

Also Read – జగన్ చదరంగంలో పావులెవరు.?

అమరావతికి, అభివృద్ధి అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. ఓ పక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని దుష్ప్రచారం చేస్తూ, స్వయంగా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు.

ఇవన్నీ ప్రజా సమస్యలపరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలు కావని, కూటమి ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించేందుకేనని అర్దమవుతూనే ఉంది.

Also Read – లేని వారి కోసం పోస్టులు..ఉన్న వారి పై కేసులా..?

కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని జగన్‌, వైసీపీ నేతలు వాదించని రోజు లేదు.

కానీ జగన్‌ స్వయంగా ‘అందరూ కేసులు పెట్టించుకోండి.. వీలైతే జైళ్ళకు కూడా వెళ్ళండి,’ అని పార్టీ ముఖ్య నేతలకు చెపుతుండటం గమనిస్తే, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందనే జగన్‌ వాదనలు అసత్యమని స్పష్టమవుతోంది.

Also Read – టీడీపీ శ్రేణుల ధర్మాగ్రహం…

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నేతల చేత టీడీపీ కార్యాలయాలపై, చంద్రబాబు నాయుడు నివాసంపై, రాజధాని రైతులపై భౌతిక దాడులు చేయించారు. ఇప్పుడు అదే విధానంతో ముందుకు సాగుతున్నారని ప్రకాశం జిల్లా, పొదిలి దాడులతో నిరూపితమైంది.

అందుకే నేరప్రవృత్తి కలిగిన ఇటువంటి రాజకీయ నాయకుల పట్ల కూటమిలో నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు కూడా.

జగన్‌ సొంత మీడియా సాక్షిలో ‘అమరావతి వేశ్యల రాజధాని’ వ్యాఖ్యలతో అమరావతిలో నివసిస్తున్న మహిళలు అవమానంగా భావించి ఆగ్రహిస్తారని జగన్‌కు బాగా తెలుసు.

ఈ పరిస్థితిలో పొదిలిలో పర్యటిస్తే నిరసనలు వ్యక్తం అవుతాయని జగన్‌కు బాగా తెలుసు. వర్షం పడవచ్చనే వాతావరణ శాఖ నివేదిక చూసి తన పర్యటనని రద్దు చేసుకున్న జగన్‌, పొదిలి పర్యటనని మాత్రం రద్దు చేసుకోక పోవడం గమనిస్తే అంతా వ్యూహాత్మకమే అని అర్దమవుతోంది.

అందరూ ఊహించినట్లే మహిళలు రోడ్డుకిరువైపులా ప్లకార్డులు పట్టుకొని శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వైసీపీ మూకలు వారిపై దాడులు జరిపాయి.

సాక్షిలో మహిళల పట్ల అంత చులకనగా మాట్లాడితేనే వారిని వెనకేసుకు వచ్చిన జగన్‌, పొదిలిలో తన కళ్ళెదుట వైసీపీ మూకలు మహిళలు, పోలీసులపై దాడులు చేస్తే అడ్డుకుంటారని ఎలా అనుకోగలం?

కానీ తామే ఆ దాడుల బాధితులమన్నట్లు, తనకు భద్రత కల్పించడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారంటూ జగన్‌ ఎదురుదాడి చేయడం కూడా ఆయన వ్యూహంలో భాగమే అని భావించవచ్చు.

అయితే వాస్తవం ఏమిటో పొదిలి ప్రజలకు, వైసీపీ మూకల దాడులను న్యూస్ ఛానల్స్ లో చూస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలుసు. పొదిలి దాడులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దర్శి పోలీసులు, తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీస్ జారీ చేశారు.