
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయ చదరంగం ఆడుకుంటూ నిందిస్తునందున సిఎం చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి పదేపదే వివరణ ఇచ్చుకోవలసివస్తోంది.
ఎన్డీఏ కూటమిలో టీడీపీ, ఏపీ ప్రభుత్వంలో బీజేపి భాగస్వామిగా ఉన్నాయి కనుక తెలంగాణ బీజేపి ఈ అంశంపై మౌనంగా ఉండటాన్ని అర్దం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం పాత్ర కూడా ఉంది కనుక ఈ సమస్యని దానికే తెలంగాణ బీజేపి నేతలు వదిలిపెట్టినట్లు భావించవచ్చు.
Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బనకచర్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి అడ్డుకునేలా చేస్తున్నప్పుడు, ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్న జగన్ మాత్రం నోరు విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లతో ఆయనకున్న రాజకీయ అవసరాలు, రాజకీయ అనుబందం కారణంగానే జగన్ నోరు విప్పడం లేదని అనుమానించక తప్పదు. అంటే జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ అవసరాలు, తన పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు అర్దమవుతోంది.
Also Read – జగన్ దండయాత్రలే వైసీపీకి శాపంగా మరబోతున్నాయా?
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెరో అవకాశం ఇచ్చారు. కనుక వచ్చే ఎన్నికలలో బీజేపికి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుంది.
కనుక తెలంగాణలో బీజేపి విజయావకాశాలు మెరుగు పరుచుకుని అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, జనసేనలతో పొత్తులు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది.
Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?
బహుశః ఈ విషయం కేసీఆర్ ఇదివరకే గ్రహించి ఉంటారు. కనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, ఈ బనకచర్ల ఆయుధంతో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు ఎన్డీఏ కూటమిని దెబ్బ తీయవచ్చని భావిస్తున్నట్లుంది.
కనుక బనకచర్ల పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరు, ఇప్పట్లో ముగిసేది కాదు. అలాగే బిఆర్ఎస్ పార్టీ సిఎం చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తూనే ఉంటుంది. కనుక బనకచర్ల పేరుతో ఈ రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి.
వాటి నడుమే సిఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకి కేంద్రం నుంచి నిధులు, అనుమతులు సాధించుకొని వచ్చి నిర్మించాల్సి ఉంటుంది.
కానీ ఈ ప్రాజెక్టుతో సిఎం చంద్రబాబు నాయుడు వేసే ప్రతీ అడుగు బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటూనే ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి ఇది పెద్ద అవరోధంగా మారినా ఆశ్చర్యం లేదు.
అందువల్ల టీడీపీ, జనసేన, బీజేపిలు కూడా ఇప్పటి నుంచే ఈ ప్రాజెక్టు పేరుతో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాలను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకొని అమలుచేయడం చాలా అవసరమే.