
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఏపీలో అధికార పక్షంలో భాగమైన జనసేన 21 సీట్లతో రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పార్టీగా విజయాన్ని నమోదుచేసుకుంది.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
స్వపక్షంలో విపక్షం మాదిరి జనసేన ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల తరపున గళం విప్పడానికి సిద్ధంగా ఉంది. అయితే 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ తమ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి గౌరవించాలంటూ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుంది.
అయితే ఏపీలో మూడవ స్థానంలో ఉన్న వైసీపీ ని రెండవ స్థానంలోకి రానివ్వకుండా అణిచివేయడానికి జనసేన తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఆ పార్టీలోని బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెండెం దొరబాబు, రోశయ్య వంటి కొంతమంది ముఖ్య నేతలకు జనసేన రెడ్ కార్పెట్ వేసింది.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
ఇక జగన్ ను అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా వైసీపీ కి గుడ్ బై చెప్పి రాజకీయాల నుండి తప్పుకున్నారు.ఇలా ఆ పార్టీలోని ముఖ్యనేతలందరు బయటకు రావడంతో ప్రస్తుతానికి వైసీపీ బలహీనమయ్యింది. దానికి తోడు ఐదేళ్ల వైసీపీ అవినీతి భాగోతాలు, అక్రమ దందాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకి రావడంతో వైసీపీ పట్ల ప్రజలలో హీనభావం ఏర్పడింది.
అంతేకాకుండా విపక్ష పార్టీగా అసెంబ్లీకి వెళ్లి ప్రజా గొంతు వినిపించాల్సిన వైసీపీ తన కు హోదా ఇవ్వలేదనే సాకుతో అసెంబ్లీకి దూరమయ్యి ప్రజల దృష్టిలో ఇంకాస్త దిగజారిపోయింది. దీనితో వైసీపీ కోల్పోయిన బలాన్ని తన ఆపార్టీ బలంగా మలచుకోవడానికి జనసేన సిద్ధంగా ఉంది.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
ఇక తెలంగాణలో 39 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ఓటమి తరువాత నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతూ ప్రజా క్షేత్రానికి దూరమయ్యారు. దానికి తోడు కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టయ్యి జైలుకెళ్లడం, గత పదేళ్ల ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు రావడం, కేటీఆర్ పై ఫోన్ టాపింగ్, ఈ ఫార్ములా రేసు కేసులు నమోదవ్వడం ఇలా బిఆర్ఎస్ తెలంగాణలో సైలెంట్ అయ్యింది.
అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు వంటి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసీఆర్ కారు దిగి హస్తం గూటికి చేరారు. ఇన్ని అంతర్గత సమస్యల మధ్య పోరాడుతున్న బిఆర్ఎస్ ప్రతిపక్ష స్థానాన్ని కబ్జా చెయ్యడానికి బీజేపీ ముందుకొచ్చింది. అందుకు తగ్గట్టే తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ బీజేపీ తెలంగాణలో తన బలం పెంచుకునే పనిలో పడింది.
ఇందులో భాగంగా మొన్న జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ నుంచి పక్కకు తప్పుకున్న బిఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ కైవశం చేసుకుని అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుంది. ఇలా బీజేపీ కాషాయ దళం బిఆర్ఎస్ గులాబీ బలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వైసీపీ బలహినతను తన బలంగా మలచుకుని ఏపీలో వైసీపీ ని భూస్థాపితం చేయడానికి జనసేన, బిఆర్ఎస్ బలాన్ని తనకు అనుకూలంగా మలచుకుని తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నాయి.
ఇలా ఈ నాలుగు రాజకీయ పార్టీల మధ్య ఒకే రకమైన రాజకీయ పోరు నడుస్తుంది. ఇందులో ఏ పార్టీ బలం ఏ పార్టీని బలహీనపరుస్తుందో తెలియాలంటే మరో సార్వత్రిక ఎన్నికలు రావాల్సిందే.