
వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంకా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాలలో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు.
కనుక ఏదో ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళివస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతామనే ఓ నమ్మకం లేదా సెంటిమెంట్ రాజకీయ నాయకులలో ఏర్పడింది.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
అందుకే ఎఫ్-1 రేసింగ్ కేసులో దమ్ముంటే తనని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే సవాలు చేశారు. బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్‌ని అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకోండన్నట్లు మాట్లాడుతున్నారు.
కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం కోసం సిఎం రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసి, నేడో రేపో అన్నట్లు మాట్లాడారు. కానీ ఈ సెంటిమెంటు భయంతోనే కేటీఆర్‌కి ఇంతవరకు ఆ ఆవకాశం కల్పించలేదేమో? ఇంకా ఎప్పటికి కల్పిస్తారో కూడా ఎవరికీ తెలీదు. అయినా కల్పించి తన పదవికి ఎసరు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి కోరుకోరు కదా?
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
అలాగని కేటీఆర్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని నిత్యం ఘాటుగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు తప్పకుండా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. కనుక రోజూ సోషల్ మీడియాలో కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
అయితే బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే ముందు ఆయన చెల్లి కల్వకుంట్ల కవిత మద్యం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఆరు నెలలు ఉండి వచ్చారు. కనుక ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ముందుగా ఆమెకే ముఖ్యమంత్రి పదవి దక్కాలి. కనుక తెలంగాణలో కూడా భవిష్యత్‌లో మరో అన్నా-చెల్లి యుద్ధం జరుగుతుందా? అంటే అది అప్రస్తుతం.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
ఇక ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్యం కేసులో కొన్ని నెలలు జైల్లో ఉండి వచ్చారు కనుక ఈ ఫార్ములా ప్రకారం ఢిల్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని భావించి ఉండవచ్చు. కానీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా జైల్లో గడిపారు కనుక ఈ ఫార్ములా పనిచేయదని తేలిపోయింది.
తెలుగు సినిమా వాళ్ళకి హైదరాబాద్‌లో అల్యూమియం ఫ్యాక్టరీ సెంటిమెంటు ఉన్నట్లు, మన రాజకీయ నాయకులకు కూడా జైలు సెంటిమెంట్ ఏర్పడింది. కానీ అల్యూమియం ఫ్యాక్టరీ లో షూటింగ్ చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అవన్నట్లే, జైలుకి వెళ్ళిన ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేరు.
కానీ పాదయాత్రలు చేసినవారు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. కనుక ముఖ్యమంత్రి పదవికి వెయిటింగ్‌లో ఉన్నవారు వెంటనే బయలుదేరితే మంచిది.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, వేసవి ఎండలు మొదలవక ముందే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే బయలుదేరిపోతే మంచిది కదా?