ఎస్సీ వర్గీకరణ కొరకు మందకృష్ణ మాదిగ దాదాపు తన జీవితానే అంకితం చేశారని చెప్పవచ్చు. ఆయన 1994లో మాదిగ రిజర్వేషన్స్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) స్థాపించి అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. దీని కోసం ఆయన కలవని పార్టీ లేదు. కలవని ముఖ్యమంత్రి లేరు.
చివరికి ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీని కలిసి మరోసారి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి సాయం అర్ధించగా ఆయన తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Also Read – త్యాగాలకు న్యాయం కావాలి…పొత్తుకు న్యాయం చెయ్యాలి..!
“రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు. వాటికి ఆ హక్కు, అధికారం ఉన్నాయి. కనుక అవి తగిన విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించుకొని అమలుచేయవచ్చు,” అని ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు సంచల తీర్పు చెప్పింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి?దేనికి?అంటే ఎస్సీ జనాభాలో 10 శాతం మాత్రమే ఉన్న మాలలకు రిజర్వేషన్లలో 90 శాతం పొందుతూ ఎక్కువ లభ్ది పొందుతుండగా, ఎస్సీలో 80 శాతం జనాభా ఉన్న మాదిగలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు మాత్రమే లభిస్తుండటం వలన విద్య, ఉద్యోగాల పోటీలో వెనుకబడిపోతున్నారు.
Also Read – దొరన్నారు…దాక్కుంటున్నారే..?
కనుక బీసీలలో ఏ,బీ,సీ,డి అని వర్గీకరణ చేసిన్నట్లే ఎస్సీలో కూడా ఏ,బీ,సీ,డి అని వర్గీకరణ చేసి జనాభా ప్రతిపదికన మాదిగలకు ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ మంద కృష్ణ మాదిగ పోరాడుతున్నారు.
సమైక్య రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంటే 2000-2004లోనే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణని అమలుచేశారు. కానీ మాల మహానాడు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టువరకు వెళ్ళి పోరాడి అనుకూలంగా తీర్పు సాధించుకుంది. కనుక ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు మార్గం సుగమం అయ్యింది.
Also Read – జోగీ జోగీ రాసుకుంటే… ఢిల్లీలో అయినా బూడిదే రాలుతుంది!
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే దీనిని అమలుచేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శాసనసభలో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు రెండు దశాబ్ధాల క్రితమే దీనిని అమలుచేసేందుకు ప్రయత్నించారు కనుక ఆయన కూడా సానుకూలంగానే స్పందించవచ్చు.
కానీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినంత మాత్రాన్న ఏ ప్రభుత్వమూ ఈ వర్గీకరణ అమలు చేసేయలేదు. దాని అమలులో అనేక సమస్యలున్నాయి. వర్గీకరణపై సుప్రీంకోర్టుఇచ్చిన తీర్పుపై మాల మహానాడు ఇంకా స్పందించాల్సి ఉంది.