ఎన్నికలకు ముందు నుంచి నేటి వరకు వైసీపీ లో బాలినేని వివాదం ఒక తెలుగు సీరియల్ మాదిరి నడుస్తూనే ఉంది. రాజీ కోసం పలువురు మాజీలు ప్రయత్నించినా చర్చలు సఫలం కాకపోవడంతో ఇక బాలినేని తన నిర్ణయం పై రాజీ పడకుండా వైసీపీకి రాజీనామా చేసారు.
ప్రకాశం జిల్లాలోనే వైసీపీకి ఆయువు పట్టులా ఉన్న ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే గత కొద్దికాలంగా బాలినేని, వైసీపీ మధ్య దూరం పెరుగుతూ పెరుగుతూ వచ్చి చివరికి వైసీపీ కి గుడ్ బై చెప్పే స్థాయికి చేరింది. ఇవాళా..రేపా అన్నట్టుగా బాలినేని రాజీనామా పై పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
Also Read – ఆ ఒక్కడి కోసమే ఏదైనా అవుతా..!
అయితే ఎట్టకేలకు ఆ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు బాలినేని వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. అలాగే తన తదుపరి కార్యాచరణకు కూడా ఆలస్యం లేకుండా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు బాలినేని.
అయితే గతంలో కూడా జనసేన అధినేత పవన్ బాలినేని విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇక జనసేనలో బాలినేని చేరిక లాంఛనప్రాయమే కావచ్చు. జనసేన పార్టీకి కూడా ఇటువంటి బలమైన సీనియర్ నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. ఆ పార్టీ క్షేత్ర స్థాయి బలోపేతానికి ఇటువంటి సొంత క్యాడర్ ఉన్న నాయకుల బలం అత్యంత ఆవశ్యకం.
Also Read – సనాతన మార్గంలో మరిన్ని త్యాగాలు… పవన్ సిద్దమేనా?
అందుచేత పవన్ కూడా బాలినేని చేరికను సాదరంగా స్వాగతించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గుంటూరు వైసీపీ ఎంపీగా పోటీ చేసిన కిలారు రోశయ్య కూడా వైసీపీ పతనం తరువాత తన దారి తానూ చూసుకుంటూ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన సభ్యత్వానికి ఎదురు చూస్తున్నారు. జగన్ మాత్రం ఇవేమి పట్టనట్టు మరో ఐదేళ్లు కళ్ళు మూసుకోండి అంటూ పార్టీ నేతలకు ఉచిత సలహాలు ఇస్తూ ఆయన మాత్రం విదేశాలకు ఎగిరిపోవడానికి కోర్ట్ అనుమతి కోసం ఎదురుతూ చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు.
అయితే జగన్ తన పార్టీ నేతలకు, కార్యకర్తలు రాబోయే ఐదేళ్లు కళ్ళు మూసుకోండి అనే చెప్పే బదులు గత ఐదేళ్లలో కాస్త నోరు మూసుకోండి అని చెప్పింటే వైసీపీ కి ముఖ్యంగా జగన్ కు ఇప్పుడీ పరిస్థితి దాపరించి ఉండేది కాదుగా..! కనీసం ఇప్పటికైనా ఆ వైసీపీ అసత్య ప్రచారాలకు తాళం వేయకపోతే వైసీపీ కి ఎగ్జిట్ బోర్డ్ తప్ప ఎంట్రీ బోర్డు ఉండదు.