Bandi Sanjay

ప్రస్తుతం మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో ఉన్నాయి. మహారాష్ట్రలో నవంబర్‌ 20న, ఝార్ఖండ్‌లో నవంబర్‌ 13,20వ తేదీలలో పోలింగ్‌ జరుగబోతోంది.

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, ఝార్ఖండ్‌లో ప్రచారానికి డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెళ్ళారు. అలాగే కేరళలో వయనాడ్‌ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు మంత్రి సీతక్క వెళ్ళారు.

Also Read – అయితే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లేగా?

ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళడంపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కొత్త టెక్నిక్ ప్రయోగిస్తోందో ఆయన వివరించారు.

“తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల చేత ఇక్కడ ప్రచారం చేయించి ప్రజలను నమ్మించి గెలిచారు. కానీ నేటికీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయడం లేదు.

Also Read – కేసీఆర్‌, కేటీఆర్‌ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?

ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణలో తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాలలో పేపర్ ప్రకటనలు ఇస్తోంది. రేవంత్‌ రెడ్డి మహారాష్ట్రకు వెళ్ళి అబద్దాలు చెపుతూ మరాఠీ ప్రజలను మోసగిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా ఇంతవరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయనే లేదు… “అంటూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల జాబితాని వివరించి వీటిలో ఎన్ని అమలుచేశారో చెప్పాలని రేవంత్‌ రెడ్డిని బండి సంజయ్‌ సవాలు చేశారు.

Also Read – అమరావతి రాజధాని… మద్యలో మన చంద్రుడు

“మహారాష్ట్రలో ప్రజలను మభ్యపెట్టడం కాదు… దమ్ముంటే తెలంగాణలో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసిందని బహిరంగంగా చెప్పగలరా?” అని బండి సంజయ్‌ సవాలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఆకర్షణీయమైన మ్యానిఫెస్టోని తయారుచేసుకొని, దానిని పొరుగు రాష్ట్రంలో అమలుచేస్తున్నామని, కనుక కాంగ్రెస్‌ని గెలిపిస్తే మీ రాష్ట్రంలో కూడా అమలుచేస్తామని నమ్మబలుకుతూ ప్రజలను మోసగించి అధికారం చేజిక్కించుకుంటోందని బండి సంజయ్‌ ఆరోపించారు.