
తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే బిఆర్ఎస్ కారు స్టీరింగ్ బీజేపీ హస్తంలోకి వెళ్లిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటూ అరవింద్ ఇప్పుడే జోస్యం చెప్పడం మొదలు పెట్టారు.
బిఆర్ఎస్ జాతక చక్రం పై తన విశ్లేషణ అందించిన అరవింద్, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నుంచి సిద్ధిపేట కేంద్రంగా హరీష్ రావు ఒక్కరే ఎన్నికవుతారని, వయస్సు రీత్యా, కేసీఆర్ కు ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ రాబోయే ఎన్నికల నాటికీ రాజకీయాల నుంచి నిష్క్రమించవచ్చు అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసారు.
Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?
అలాగే సిరిసిల్ల నుంచి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఓడిపోబోతున్నారంటూ వచ్చే నాలుగేళ్ళ బిఆర్ఎస్ భవితవ్యాన్ని అరవింద్ నాలుగు నిముషాలలో ప్రకటించేసారు. బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆ స్థానాన్ని అందిపుచ్చుకుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు అరవింద్.
అయితే ఇటీవల కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా భవిష్యత్ లో బిఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని, ఆ దిశగా పార్టీలోనే కొంతమంది కోవర్టులు బీజేపీ కోసం పని చేస్తున్నారంటూ పరోక్షంగా హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
Also Read – జగన్ చదరంగంలో పావులెవరు.?
బీజేపీ లో బిఆర్ఎస్ విలీనానికి పార్టీలోని వారే కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ నాయకులని కూడా ఉలిక్కిపడేలా చేసాయి. అయితే ఈ బీజేపీ – బిఆర్ఎస్ విలీన ప్రక్రియలో హరీష్ రావు పేరే ప్రముఖంగా తెరమీదకు వస్తున్నా ఈ నేపథ్యంలో తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యలు కవిత విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
కేటీఆర్ ఫోన్ టాపింగ్ వ్యవహారం, కేసీఆర్, హరీష్ ల కాళేశ్వరం పంచాయితీలు అన్ని ఒక కొలిక్కి రావాలి అంటే బిఆర్ఎస్ కు బీజేపీ సాయం తప్పనిసరి. అయితే ఆ సాయం బీజేపీ నుంచి బిఆర్ఎస్ కు అందడానికి ఇరు పార్టీల మధ్య రాయబారం చేసే ఆ మధ్యవర్తి హరీష్ అవుతారా.? అందుకే అటు బీజేపీ, ఇటు బిఆర్ఎస్ హరీష్ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచించి మాట్లాడుతున్నారా.?
Also Read – లేని వారి కోసం పోస్టులు..ఉన్న వారి పై కేసులా..?
కేసీఆర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనేది ఊహాతీతం, కేటీఆర్ సిరిసిల్ల లో పత్తాలేకుండా పోతారు అనేది కూడా గ్రౌండ్ రియాలిటీకి చాల దూరంగా కనిపిస్తుంది. కానీ హరీష్ గెలుపు మాత్రం ఖాయం అంటూ అరవింద్ నొక్కి వక్కాణించడం వాస్తవ రూపానికి దగ్గరగా ఉంది.
అయితే కేసీఆర్ కుటుంబంలో అందరి జాతకం చెప్పిన అరవింద్ కేసీఆర్ ముద్దుల కూతురు, బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్సీ, జాగృతి ఫౌండర్ కవిత పేరు విస్మరించడం కొన్ని సందేహాలకు తావిస్తుంది.
అంటే రాబోయే ఎన్నికల నాటికీ కవిత కేసీఆర్ కారు దిగిపోతారా.? లేక బిఆర్ఎస్ పార్టీనే కవితను గులాబీ జెండాకు దూరం పెడుతుందా.? లేక కవిత కూడా ఓటమి అవమానం భారాన్ని భరిస్తారా.?