Botsa-Satyanarayana Seniority in YSRCP

రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉంటే దానికి అనుకూలంగా మాట్లాడటం సహజమే. కానీ శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పుడు బొత్స వంటి కొందరు సీనియర్ నేతలు తమ పార్టీ వైఫల్యాల గురించి క్లుప్తంగా ఒకటి రెండు ముక్కలు మాట్లాడారు. కానీ తమ పార్టీ ఓటమికి ప్రధాన కారకుడు జగన్‌.. ఆయన తుగ్లక్ పాలనే అని అందరికీ తెలుసు. కానీ ఎవరూ అది బయటకు చెప్పుకోలేరు కదా?

జగన్‌ వయసు బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవం అంత ఉండదు. వైసీపీలో ఇంకా చాలా మందే ఉన్నారు. కానీ ఎవరూ ధైర్యం చేసి జగన్‌కి ఇది తప్పని చెప్పలేకపోవడం వలననే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు…. నా రాజ్యానికి మూడు రాజధానులు అంటూ ఇష్టారాజ్యం చేసి అందరి కొంపముంచేశారు.

Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్

అప్పుడు మంత్రి పదవులకు, కాంట్రాక్టులకు ఆశపడి ఎవరూ పిల్లి మెడలో గంట కట్టలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ నేటికీ ఎవరూ జగన్‌కి చెప్పలేకపోతున్నారు. పైగా ఆయన చెప్పిన లైన్ తీసుకొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నవ్వులపాలవుతున్నారు.

పార్టీలో సీనియర్ నేత, శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాటలు వింటే ఇది అర్దమవుతుంది. “ప్రజల చేత తాగుడు మాన్పించాలనే జగన్‌ మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. కానీ చంద్రబాబు నాయుడు అందరి చేత తాగించి మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని మద్యం ధరలు తగ్గించేసి ప్రతీ ఒక్కరికీ మద్యం అందుబాటులోకి తెస్తున్నారు.

Also Read – సుప్రీంకోర్టుకే కుచ్చు టోపీ పెడుతున్నారే!

ఇదివరకు ప్రజలకు సంక్షేమ పధకాలు సొమ్ము అందుతూ ఉండేది కనుక వారి కొనుగోలు శక్తి బాగుండేది. దాని వలన ప్రభుత్వానికి భారీగా జీఎస్టీ ఆదాయం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం ఆ పధకాలు అమలుచేయకపోవడంతో ప్రజల చేతిలో డబ్బులేక ఈ సారి సంక్రాంతి పండుగకి మార్కెట్లు వెలవెలపోయాయి. అందుకే ఈసారి జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది.

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సమీక్షా సమావేశాలు నిర్వహించడం తప్ప ఆచరణలో ఏమీ చేయక పోవడం వలన సమస్యలు పేరుకుపోతున్నాయి. రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. చంద్రబాబు నాయుడు 8 నెలలు వృధా చేశారు,” అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని

విజయనగరం జిల్లా మద్యం సిండికేట్ బొత్స ఆయన అనుచరుల చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యం. కనుక మద్యం ధరలు తగ్గితే నష్టపోతామనే ఆందోళనతోనే ఈవిదంగా మాట్లాడి ఉండొచ్చు. జగన్‌ హయంలో చీప్ లిక్కర్, కల్తీ మద్యం, గంజాయి అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయో, వాటి వెనుక వైసీపీ పెద్దలున్నారనే విషయం అందరికీ తెలుసు.

పేద ప్రజలు, వెనుకబడినవారు కూడా అభ్యున్నతి సాధించడానికి, వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికి తోడ్పడటానికే సంక్షేమ పధకాలు. కానీ ఆ పేరుతో ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ప్రజలు బట్టలు, టీవీలు, ఫ్రిజ్జులు తదితర ఇంట్లో వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం కోసమే అన్నట్లున్నాయి బొత్స సత్యనారాయణ మాటలు.

ఇక చంద్రబాబు నాయుడు 8 నెలలు వృధా చేశారని ఆరోపించిన బొత్సకు తమ అధినేత జగన్‌ రాజకీయ కక్షలు, కూల్చివేతలు, వైసీపీ రంగులు, స్టిక్కర్లు, పేర్లు మార్చడంతో అత్యంత విలువైన 5 ఏళ్ళ సమయం వృధా చేశారని తెలీదా?

అమరావతి నిర్మాణ పనులను 5 ఏళ్ళు నిలిపివేయవడం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో బొత్సకు తెలియదా?ఇప్పుడు అవే పనులకు రెట్టింపు వ్యయం అవుతుందని తెలియదా?

ఇంత రాజకీయ, పాలనానుభవం ఉన్న బొత్స సత్యనారాయణ, మద్యం ధరల తగ్గింపు, సంక్షేమ పధకాలు, జీఎస్టీ గురించి ఈవిదంగా మాట్లాడితే ప్రజలు నవ్వరా? నిజానికి జగన్‌ పంచన చేరి బొత్స సత్యనారాయణ తన అనుభవాన్నే వృధా చేసుకుంటున్నారు. జగన్‌తో సహవాసం చేస్తున్నారు కనుక రేపు విజయసాయి రెడ్డిలాగే ఏదైనా జరిగినా ఆశ్చర్యం లేదు.