విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఆగస్ట్ 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. వైసీపి ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీని వీడి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై అనర్హుత వేటుపడటంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.
Also Read – కేసీఆర్, చంద్రబాబుకి తేడా ఇదేగా!
విశాఖ స్థానిక సంస్థలలో మొత్తం 841 మంది సభ్యులు ఉండగా వారిలో 615 వైసీపికి చెందినవారే ఉన్నారు. టిడిపికి కేవలం 215 మంది మాత్రమే ఉన్నారు. కనుక ఈ ఉప ఎన్నికలో వైసీపి ఎవరిని నిలబెట్టినా అవలీలగా ఎమ్మెల్సీగా గెలుస్తారు. కానీ ఏకంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అభ్యర్ధిగా బరిలో దించుతున్నారు జగన్.
దానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటికే విశాఖలో పలువురు వైసీపి కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు వైసీపికి రాజీనామాలు చేసి టిడిపి, జనసేన పార్టీలలో చేరిపోయారు.
Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల జీవీఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తే 58 మంది వైసీపి కార్పొరేటర్లలో 42 మంది మాత్రమే వచ్చారు. వారు కూడా ఉత్తరాంధ్రా జిల్లాల ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనుక వారిలో పోలింగ్ సమయానికి ఎంతమంది వైసీపిలో ఉంటారో ఉన్నవారిలో ఎంతమంది వైసీపి అభ్యర్ధికి ఓట్లు వేస్తారో తెలీని పరిస్థితి కనిపిస్తోంది.
కానీ వైసీపికి చెందిన ఈ ఎమ్మెల్సీ సీటుని మళ్ళీ దక్కించుకోకపోతే జిల్లాలో మిగిలినవారు కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక అందరితో మంచి పరిచయాలు, అంగ బలం, అర్ధ బలం కలిగిన బొత్స సత్యనారాయణ పేరుని జగన్ ఖరారు చేశారు.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కించేశారా?
ఈ ఉప ఎన్నికలో గెలవడం వైసీపికి కీలకం కావచ్చు. కానీ బొత్స సత్యనారాయణ చేతిలో ఓడితే టిడిపి లేదా జనసేనకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు.
ఈ ఉప ఎన్నికలో బొత్స సత్యనారాయణ గెలిచినా అది ఆయన ప్రతిష్టని పెంచదు. దీంతో ఆయనకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.
సమైక్య రాష్ట్రంలో, మళ్ళీ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన, ఓ ఎమ్మెల్సీ పదవికి పోటీ పడుతుండటం ఆయన స్థాయికి తగదనే చెప్పొచ్చు.
ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన ఆయన ఒకవేళ ఈ ఉపఎన్నికలో కూడా ఓడిపోతే ఆయన ప్రతిష్ట మరింత మసకబారుతుంది. అది ఆయనకు మరీ అవమానంగా మారుతుంది కదా?
ఈ విషయం టిడిపి, జనసేనలకు కూడా బాగా తెలుసు. కనుక ఉత్తరాంధ్రాలో బొత్స సత్యనారాయణ రాజకీయ పరపతిని దెబ్బ తీసి, ఆయన స్థాయిని తగ్గించేందుకు ఆ రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికలని ఓ గొప్ప అవకాశంగా భావించి ఆయనను ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయమే. అందుకోసం ఆ రెండు పార్టీలు తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి కూడా.