
భారత్‌పై దాడులకు టర్కీ సరఫరా చేసిన డ్రోన్లను పాక్ వినియోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో #బాయ్‌కాట్ టర్కీ పేరుతో ఉదృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రభావం అప్పుడే కనబడుతోంది కూడా.
పూణేలో పళ్ళ వ్యాపారులు ఇకపై టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకోమని ప్రకటించారు. ఒక్క పూణే నగరంలోనే ఏడాదికి రూ.1200-1500 కోట్లు విలువగల టర్కీ యాపిల్స్ అమ్ముతుంటామని చెప్పారు. కనుక ఇతర రాష్ట్రాలలో పళ్ళ వ్యాపారులు కూడా టర్కీ నుంచి యాపిల్స్‌తో సహా అన్ని రకాల పళ్ళు దిగుమతులు, అమ్మకాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read – జగన్, కేటీఆర్: ఇద్దరి లక్ష్యం ఒక్కటేనా.?
సినీ నటుడు నిఖిల్ సిద్దార్థ్ కూడా దేశ ప్రజలకు టర్కీ పర్యటనలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏటా భారతీయులు టర్కీలో పర్యటిస్తూ ఆ దేశానికి వేల కోట్లు సమర్పించుకుంటున్నారని, భారత్‌పై దాడులు చేసేందుకు పాక్‌కు తోడ్పడుతున్న అటువంటి దేశానికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి?ఆ దేశంలో మన డబ్బు ఖర్చు చేయడం దేనికని నిఖిల్ ప్రశ్నించారు. పాక్‌కు అండగా నిలబడతామంటూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన తాజా ప్రకటనని నిఖిల్ ట్యాగ్ చేశారు.
ఇప్పటికే పలువురు భారతీయులు టర్కీ పర్యటనలు, అక్కడి హోటల్ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధికంగా టాలీవుడ్ టర్కీలో సినిమా షూటింగులు జరుపుతుంటుంది. ఒకవేళ భారతీయ సినీ పరిశ్రమ కూడా #బాయ్‌కాట్ టర్కీ ఉద్యమంలో పాల్గొంటే ఆ దేశానికి గట్టిగా బుద్ది చెప్పినట్లవుతుంది.
Also Read – మెగా సినిమాలకు ఏమయ్యింది.?
పాకిస్థాన్‌కు టర్కీ కేవలం డ్రోన్లు మాత్రమే సరఫరా చేసింది. కానీ చైనా అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, యుద్ధ విమానాలు ఇంకా చాలా అందించింది. భారత్-పాక్ మద్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో అవసరమైతే పాక్‌కి అండగా నిలబడతామని కూడా ప్రకటించింది.
చాప కింద నీరులా భారత్ అంతటా వ్యాపించిన చైనా ఉత్పత్తులతో భారతీయ పరిశ్రమలు ఎంతగా నష్టపోయాయో, ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో ఎవరూ ఊహించలేరు. చైనా ఉత్పత్తులకు భారతీయులు ఎంతగా అలవాటు పడ్డారంటే, ఇప్పుడు చైనా ఉత్పత్తులు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.
Also Read – గమనిక: కొడాలి నానిని అరెస్ట్ చేయలేదు!
పాకిస్థాన్ నేరుగా భారత్‌పై ఉగ్రదాడులు, డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తుంటే, భారతీయ పరిశ్రమలని, లక్షలాది కార్మికులను చైనా నిశబ్ధంగా చావు దెబ్బ తీస్తోంది. చైనా సృష్టించిన కరోనా మహమ్మారికి భారత్‌లో లక్షల మంది చనిపోయారు. కరోనా, లాక్ డవున్ కారణంగా దేశంలో లక్షల మంది రోడ్డున పడిన సంగతి తెలిసిందే.
కనుక #బాయ్‌కాట్ టర్కీ మాత్రమే సరిపోదు. #బాయ్‌కాట్ చైనా కూడా చాలా అవసరమే. లేకుంటే భారతీయుల వద్ద సంపాదించిన డబ్బుతో చైనా ఆయుధాలు తయారుచేసి పాకిస్థాన్‌కు సరఫరా చేస్తూనే ఉంటుంది.