KTR To Start Padayatra

1995 నుండి 2004 వరకు అంటే సరిగ్గా తొమ్మిదేళ్ల టీడీపీ ఏకచక్రాధిపత్యం, హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు దూకుడుకి బ్రేకులు వేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అప్పటి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు వైస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త ‘పాదయాత్ర’ కు శ్రీకారం చుట్టారు.

అయితే వైస్సార్ పాదయాత్రతో తిరిగి అధికారంలోకి రాదు అనుకున్న కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను పరిచయం చేసారు. ఇక అదే ఆనవాయితీని కొనసాగిస్తూ పదేళ్ల కాంగ్రెస్ పాలనను మట్టి కరిపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆరు పదుల వయస్సులో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసారు.

Also Read – కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?

పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అయితే ఈ ఇద్దరు సీనియర్ నాయకుల పాదయాత్రకు పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర విభజన వంటి అంశాలు కలిసి రావడంతో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు, ముఖ్యమంత్రిగా అవకాశాన్ని అందుకోగలిగారు. అయితే నాటి నుంచి పాదయాత్ర అంటే ఒక పార్టీ అధికార యాత్రగా, ఒక నాయకుడి పదవి యాత్రగా మారిపోయింది.

అయితే ఈ సంప్రదాయాన్ని బలపరుస్తూ వైస్ జగన్ మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు ముందు ఏపీ లో సుమారు ఏడాది పాటు పాదయాత్ర చేసి, ప్రజలకు ముద్దులు పెట్టి, ఓదార్చి ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ ఐదేళ్ల వైసీపీ పాలన కు చరమ గీతం పాడి, ప్రభుత్వ అణిచివేతలకు గురై బలహీన పడ్డ పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి, ‘యువగళం’ పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసారు నారా లోకేష్. దాని ఫలితం 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

2019, 2024 ఎన్నికలలో పాదయాత్రలు చేసిన ఆయా పార్టీల నాయకులు అధికారాన్ని అందిపుచ్చుకోవడం పాదయాత్ర మహిమో, లేక ప్రభుత్వ వైతిరేకతతో కానీ ఓటమిలో ఉన్న పార్టీలకు, నైరాశ్యంలో ఉన్న నాయకులకు పాదయాత్ర అనేది ఒక దివ్య ఔషధం మాదిరి, అధికారాన్ని అందించే ఒక మ్యాజికల్ పవర్ లా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అధికారానికి దూరమైన వైసీపీ, బిఆర్ఎస్ కూడా తిరిగి తమ అధికారాన్ని దక్కించుకోవడానికి పాదయాత్రనే అస్త్రంగా బయటకు తీయనుంది.

ఇప్పటికే వైసీపీ అధినేత వైస్ జగన్ నాకు వయసుంది, పాదయాత్ర చేసే సత్తువ ఉంది, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మరోమారు పాదయాత్ర చేస్తాను అంటూ పార్టీ శ్రేణులకు హామీ, ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు పంపారు. ఇక తెలంగాణలో పదేళ్ల అధికారానికి దూరమైన పది నెలలకే అల్లాడిపోతున్న బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ అధికార పార్టీని బెదించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

అలాగే ఇటు పార్టీ క్యాడర్ ను, లీడర్లను కాపాడుకోవడానికి త్వరలో నేను పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తాను అంటూ ప్రకటించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బిఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది నుండి పాదయాత్రకు రంగం సిద్ధమవుతుందని, ఈ లోపు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టి స్థానికంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల రూపకల్పన చేపడతాం అంటూ వెల్లడించారు కేటీఆర్.

మరి కేటీఆర్ పాదయాత్ర తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి తిరిగి అధికార దాహాన్ని తీర్చగలుగుతుందా లేదా అనేది చూడాలి. అలాగే పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అంటూ తెలంగాణలో టి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైస్ షర్మిల పాదయాత్ర మాత్రం ఆమె పార్టీ బలోపేతానికి గుక్కెడు తీర్ధం నీళ్లు కూడా పోయలేకపోయింది.




దీనితో కేవలం పాదయాత్రతోనే అధికారాన్ని అందిపుచ్చుకోలేమని, దానికి తోడు రాష్ట్రంలో బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, ఆయా పార్టీ నాయకుల మీద స్థిరమైన నమ్మకం కూడా ప్రజలలో కల్పించాల్సిన బాధ్యత నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద ఉంటుందనేది తేలిపోయింది. ఇక నుండి పాదయాత్ర అనేది ఒకప్పటి చరిత్ర కాదు రాబోయే భవిష్యత్ అనేది కూడా స్పష్టమయింది.