Case On Venkatesh Suresh Babu

గతంలో తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడే ఓ వెలుగు వెలిగింది. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత మరింతగా అభివృద్ధి చెందింది.

ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా 5 భాషల్లో తీయడం పరిపాటి అయిపోయింది. బాహుబలి, కార్తికేయ, ఆర్‌ఆర్‌ఆర్‌, హనుమాన్, పుష్ప-2ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమ పేరు యావత్ దేశంలో, విదేశాలలో మారుమ్రోగిపోతోంది.

Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?

భారతీయ సినిమా తెలుగు సినిమా అని అనుకునే స్థాయికి చేరింది. తెలుగు సినీ పరిశ్రమకు ఈ స్థాయికి చేరుకుంది కనుకనే ఇప్పుడు జాతీయ మీడియా, యావత్ దేశ ప్రజల దృష్టి టాలీవుడ్‌పై ఉంది.

తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని సంతోషిస్తుంటే, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ మాస్టర్ కేసు, మోహన్ బాబు ఇంట్లో గొడవలు, సంధ్య థియేటర్‌ వరుస ఘటనలతో సినీ పరిశ్రమకి తీరని అప్రదిష్ట కలిగింది.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

ఇప్పుడు జాతీయ మీడియా, దేశప్రజల దృష్టి టాలీవుడ్‌పై ఉంది కనుక చిన్న వివాదం, సమస్య జరిగినా వైరల్ అవుతోంది. కనుక తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నవారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కానీ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు వంటి దగ్గుబాటి సురేష్ కుటుంబం ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫిల్మ్ నగర్‌లో డక్కన్ కిచెన్ హోటల్ స్థల వివాదంలో దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్‌, రానా, అభిరామ్ నలుగురిపై ఫిల్మ్ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?

వారికీ, బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నంద కుమార్‌కి దాని గురించి వివాదం మొదలైనప్పుడు, నందకుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించి ‘యధాతధ స్థితి’ కొనసాగించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు గత ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ సిబ్బందిని వెంటపెట్టుకొని వెళ్ళి ఆ హోటల్‌ని పూర్తిగా కూల్చివేశారు.

నంద కుమార్‌ మళ్ళీ నాంపల్లి కోర్టుని ఆశ్రయించడంతో, దగ్గుబాటి కుటుంబ సభ్యులు నలుగురిపై కోర్టు ధిక్కారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు పోలీసులు వారి నాలుగురిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అల్లు అర్జున్‌-సంధ్య థియేటర్‌ కేసు నుంచి మెల్లగా బయటపడుతున్నారనుకుంటే, ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు కుటుంబం ఇటువంటి కేసులో చిక్కుకోవడంతో టాలీవుడ్‌లో మళ్ళీ మరో కొత్త కధ మొదలైంది. డక్కన్ కిచెన్ హోటల్ స్థల వివాదంలో యధాతధ స్థితి కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, అన్నీ తెలిసిన దగ్గుబాటి కుటుంబం ఆ తీర్పుని ఉల్లంఘించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.




ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి టాలీవుడ్‌పై ఉంది కనుక ఈ కేసు గురించి అప్పుడే వైరల్ అవుతోంది. మరి దగ్గుబాటి కుటుంబం ఈ కేసులో నుంచి ఎప్పుడు ఏవిదంగా బయటపడుతుందో?