
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం 58 రోజులు నిరావదిక నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జయంతి నేడు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఓ చక్కటి నిర్ణయం ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసిన 58 రోజులు నిరావదిక దీక్షను భవిష్యత్ తరాలకు గుర్తు చేసేందుకు రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తాము. అలాగే నెల్లూరు జిల్లాలో ఆయన స్వగ్రామం పడమటిపల్లెని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అక్కడ ఆయన పేరుతో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తాం.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
ఆ గ్రామంలో ఆయన పేరుతో అత్యాధునిక వసతులతో చక్కటి ఉన్నత పాఠశాల నిర్మిస్తాం. నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 16 వరకు ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. యువతకు, పాఠశాల విద్యార్ధులకు ఆయన జీవిత చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు తెలియజేసేవిదంగా పలు కార్యక్రమాలు చేపడతాం,” అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి తన ప్రాణాలు పణంగా పెట్టారంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనని ‘తెలంగాణ జాతిపిత’, ‘తెలంగాణ గాంధీ’ అంటూ పొగుడుకుంటారు. ఏటా దీక్షా దివస్ అంటూ ఆయన ఆమరణ దీక్షని ప్రజలకు గుర్తుచేస్తుంటారు. కేసీఆర్ హాస్పిటలలో సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటూ ఆమరణ దీక్ష చేసినప్పటికీ ఆయనకు ఇంత అపూర్వమైన గౌరవం లభిస్తోంది.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
ఆ లెక్కన భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడి మహాత్మా గాంధీజీతో కలిసి పనిచేసి జైలుకి వెళ్ళిన పొట్టి శ్రీరాములుకి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏకధాటిగా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకి ఎంత గౌరవం దక్కాలి?దక్కుతోందా? అసలు ఆయన గురించి రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు?అంటే సమాధానం చెప్పడం కష్టమే.
ఆయన ప్రాణత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తే అది ఎలాగూ రెండు ముక్కలైపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై రాజకీయ వివాదం ఏర్పడటంతో అది కూడా జరుపుకోవడం మానేశాము. మన ఉనికిని మనమే గుర్తించడానికి ఇష్టపడటం లేదనుకోవాలేమో?
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఇన్ని మంచి నిర్ణయాలు తీసుకున్న సిఎం చంద్రబాబు నాయుడు ఇక నుంచి ఏటా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరిపిస్తే, అదే ఆ మహనీయుడుకి ఆంధ్రా ప్రజలు ఇచ్చే ఘనమైన నివాళి అవుతుంది.