Chandrababu Naidu Family Pawan Kalyan Family

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాజకీయ నాయకుల కుటుంబ బంధాలకు అద్దం పట్టాయని చెప్పవచ్చు. తెలంగాణలో కేసీఆర్‌ తన కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.

Also Read – జగన్‌కు క్లారిటీ ఉంది… మరి టిడిపికి?

ఒకానొక సమయంలో తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని తన కుమారుడు కేటీఆర్‌ని ఆ కుర్చీలో కూర్చోపెట్టాలనుకున్నారు. కానీ వివిద కారణాల చేత కొడుకుని ముఖ్యమంత్రిగా చేయలేకపోయారు. కానీ తన ప్రభుత్వంలో, పార్టీలో తన తర్వాత కేటీఆర్‌ నెంబర్ 2 స్థానంలో ఉండేలా చేయగలిగారు.

కూతురు కల్వకుంట్ల కవితకు ఎంపీగా చేసి మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిని చేద్దామనుకున్నారు. కానీ మోదీపై కత్తులు దూయడం వలన, ఆమె లిక్కర్ స్కామ్‌లో ప్రవేశించకుండా ముందే వారించకపోవడం వలన కేంద్రమంత్రి కావలసిన కల్వకుంట్ల కవిత, ఇప్పుడు తిహార్ జైల్లో మగ్గుతున్నారు.

Also Read – రాజకీయమా? రాక్షసత్వమా?

ఆమెని విడిపించుకోవడానికే లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని బీజేపీకి బలి ఇచ్చారని, అందువల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగిందని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలను కొట్టిపడేయలేము. అది వేరే విషయం.

రేవంత్‌ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులు సోదరులతో బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ వివిద కారణాల చేత వారిని రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు.

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నా ఎనాడూ రాజకీయాల జోలికి రాని ఆయన భార్య భువనేశ్వరి, తొలిసారిగా తన భర్తను జగన్‌ జైల్లో పెట్టించినప్పుడు, ఇంటి గడప దాటి ప్రజల మద్యకు వచ్చారు.

అలాగే బ్రాహ్మణి కూడా మావగారికి మద్దతుగా ప్రజల మద్యకు వచ్చి జగన్‌ అవినీతి, అసమర్ధ పాలనపై నిప్పులు చెరిగారు.

ఆ సమయంలో వారిరువురూ ప్రజల మద్యకు రావడంతో రాష్ట్రంలో మహిళా ఓటర్లలో చంద్రబాబు నాయుడుపై సానుభూతి ఏర్పడి అది ఎన్నికలలో టిడిపికి ఘన విజయానికి దోహదపడింది.

నారా లోకేష్‌ కూడా తన తండ్రిని జైలు నుంచి విడిపించుకోవడానికి ఢిల్లీ వరకు వెళ్ళి అలుపెరుగని పోరాటం చేసి తండ్రి కోసం దేనికైనా సిద్దమే అని చెప్పడం అందరూ చూశారు.

పవన్‌ కళ్యాణ్‌ విషయానికి వస్తే గత 5 ఏళ్ళుగా జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేల నోటికి బలైపోయిన ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి జగన్‌తో సహా వైసీపిలో అందరూ ఎంత హేళనగా మాట్లాడారో అందరూ విన్నారు.

కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, పవన్‌ కళ్యాణ్‌ నుంచి విడిపోయినప్పటికీ రేణూ దేశాయ్, వారి కుమారుడు, కుమార్తెకు పవన్‌ కళ్యాణ్‌ అంటే చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. కానీ జగన్‌కి సొంత తల్లి, చెల్లితోనే పడదు. ఇద్దరినీ ఆయనే బయటకు సాగనంపారు.

వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ ఇద్దరూ కూడా ఈ ఎన్నికలలో జగన్‌ను వ్యతిరేకించారు. అటువంటి వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ కుటుంబం గురించి హేళనగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

పవన్‌ కళ్యాణ్‌ని హేళన చేసేందుకు మూడు పెళ్ళాలు-కార్లు మార్చిన్నట్లు పెళ్ళాలు మారుస్తాడంటూ జగన్‌ మాట్లాడిన మాటలతో నొచ్చుకున్న మహిళా ఓటర్లు జగన్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు కూడా. బహుశః ఇదే కారణంగా పవన్‌ కళ్యాణ్‌ అన్నదమ్ములు, భార్య, పిల్లలు, చివరికి మాజీ భార్య రేణుకా దేశాయ్ అందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డారని, వారి మద్య బంధాలు ఇంకా బలపడ్డాయని చెప్పవచ్చు.

అన్న చిరంజీవి తనకు రాజకీయంగా తోడ్పడకపోయినా, కనీసం ఎన్నికల ప్రచారానికి రాకపోయినా పవన్‌ కళ్యాణ్‌ తప్పుగా అనుకోలేదు. ఎన్నికలలో గెలిచిన వెంటనే తల్లి, అన్నావదినల పాదాలకు నమస్కరించి వారి దీవెనలు అందుకొని వారితో తన విజయానందాన్ని కలిసి పంచుకున్నారు.

ఆ తర్వాత తన భార్య అన్నా లేజ్నెవా, కుమారుడు అఖీరా నందన్‌లని ఢిల్లీకి తీసుకువెళ్ళి వారిని ప్రధాని నరేంద్రమోడీకి పరిచయం చేశారు. ఇది తన జీవితంలో అపురూపమైన క్షణమని పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుకా దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈవిదంగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ బలమైన కుటుంబ బంధాలు అనుబంధాలను కలిగి అందరినీ కలుపుకు ముందుకు సాగిపోతుంటే, కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ ప్రతీ ఒక్కరినీ అనుమానిస్తూ, ప్రతీ ఒక్కరినీ శత్రువులుగా మార్చేసుకుంటూ చివరికి ఏకాకులుగా మిగిలిపోయారు.