
సిఎం చంద్రబాబు నాయుడు తాజా మంత్రి వర్గ సమావేశంలో తనతో సహా మంత్రులందరి ర్యాంకులు ఇచ్చారు. వాటిలో చంద్రబాబు నాయుడు తనకు తాను 6వ ర్యాంక్ ఇచ్చుకోగా, మంత్రి నారా లోకేష్‌కి 8, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పవన్ కళ్యాణ్‌కి 10 వ ర్యాంక్ ఇచ్చారు.
తనకి 10 వ ర్యాంక్ ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ ఆయన అంత చురుకుగా పనిచేస్తుంటే 10వ ర్యాంక్ ఇస్తారా? అంటూ జనసేనలో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
పవన్ కళ్యాణ్‌కి 10 వ ర్యాంక్ వచ్చిందని బాధపడేవారు తమ జనసేనకే చెందిన మంత్రి కందుల దుర్గేష్ రెండో స్థానంలో, మంత్రి నాదెండ్ల మనోహర్ 4వ స్థానంలో ఉన్నారని గమనించాల్సిన అవసరం ఉంది.
టీడీపీ మంత్రులలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ మొదటి ర్యాంక్, చిన్న, మద్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కంటే చాలా చురుకుగా పనిచేస్తున్నారని నిరూపించుకున్నారు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
అయితే ఇది మంత్రుల పనితీరుకి ఇచ్చిన ర్యాంక్స్ కావని వారు తమ టేబిల్‌పై ఉన్న ఫైల్స్ ఎంత త్వరగా క్లియర్ చేశారనేది మాత్రమే పరిగణనలోకి తీసుకొని ర్యాంక్స్ ఇచ్చామని తెలియజేస్తూ సిఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
పరీక్షలు బాగా వ్రాశానని సంతోషపడుతున్న విద్యార్ధికి కాస్త తక్కువ మార్కులు వస్తే ఏవిదంగా బాధపడతాడో ఆదేవిదంగా కూటమి ప్రభుత్వంలో తక్కువ ర్యాంక్ వచ్చిన మంత్రులు కూడా బాధపడవచ్చు. సిఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చూస్తే ర్యాంక్స్ పరమార్ధం తెలుస్తుంది.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
జగన్ విధ్వంస పాలనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరూ ఎంతగానో కష్టడుతున్నప్పటికీ, ఈ వేగం సరిపోదని మరింత వేగంగా పనిచేయాలని సూచించేందుకే ఈ ర్యాంక్స్ అని తెలిపారు. పని విషయంలో పోటీతత్వం చాలా అవసరమని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నిజమే కదా?