chandrababu-naidu-policies-are-correct

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వాలు మారాయి. అక్కడ కాంగ్రెస్‌, ఇక్కడ టీడీపీ రెండూ ఎన్నికలలో ప్రజలకు అనేక వాగ్ధానాలు చేశాయి. కనుక వాటన్నిటినీ అమలు చేయాలని అక్కడ బిఆర్ఎస్, ఇక్కడ వైసీపీ ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి.

గతంలో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా చేసిన అప్పుల కారణంగా ఇప్పటి రెండు ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉందని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చెపుతున్నారు.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

కానీ తమ హయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భేషుగ్గా ఉన్నప్పుడు ప్రభుత్వం మారగానే ఎలా దయనీయంగా మారుతుందని రెండు పార్టీలు తెలివిగా ప్రశ్నిస్తున్నాయి. ఇద్దరూ అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు వాదిస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే, రాష్ట్రాలని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి, హామీలు అమలుచేయలేని పరిస్థితి కల్పించిన్నట్లు అనిపిస్తుంది.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

అంటే ఎడాపెడా అప్పులు చేసి దిగిపోవడం కూడా ఓ రకమైన రాజకీయ వ్యూహమేనా?అనే అనుమానం కలుగుతుంది.

హామీల అమలు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తే ఏమవుతుందో తెలియాలంటే, నిన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వాదనలు వింటే అర్దమవుతుంది.

Also Read – డీలిమిటేషన్‌: రాజకీయ లెక్కలు సరిచూసుకోవలసిందే!

“రూ.2-3,000 కోట్లు ఖర్చుతో రైతుబంధు పధకం అమలుచేసి రైతులను సంతృప్తి పరచవచ్చు. కానీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోనప్పుడు రూ.22,000 కోట్లతో పంట రుణాల మాఫీ చేయడానికి తొందరపడటం అవసరమా?

మహాలక్ష్మీ పధకం వంటివి ప్రభుత్వానికి, ఆర్టీసీకి భారంగా మారాయి కదా? పేదలకు ఇళ్ళు, రేషన్ కార్డులు ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ గ్రామ సభలు పెట్టి హడావుడి చేసిన తర్వాత ఇవ్వలేకపోతే ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా?

రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు చేయించేందుకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేన్నప్పుడు పధకాల అమలుచేస్తామంటూ ప్రకటనలు దేనికి?ఇన్ని పధకాలు అమలుచేస్తున్నా ప్రభుత్వానికి విమర్శలు తప్పడం లేదు కదా?” అని ప్రశ్నించారు.

ప్రజల చేత మంచి అనిపించుకోవడానికో లేదా ప్రతిపక్షాల విమర్శలు, ఒత్తిళ్ళు భరించలేకనో లేదా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందనే భయం చేతనో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలా దూకుడుగా ఎన్నికల హామీలు అమలుచేస్తే పరిస్థితి దయనీయంగా మారిందని రాజగోపాల్ రెడ్డి మాటలతో స్పష్టమయింది. అప్పుడు పార్టీలోనే అసమ్మతి మొదలవుతుంది తప్ప ప్రభుత్వం గ్రాఫ్ పెరగదని స్పష్టం అవుతోంది.

ఈ నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు విధానమే సరైనదని స్పష్టమవుతోంది. ఎన్నికలలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చినందున వాటిని అమలుచేయడం ఆయన బాధ్యతే. కానీ వాటి అమలుకి మరికొంత సమయం తీసుకోవడం సరైన నిర్ణయమే అని చెప్పొచ్చు.

ప్రజలపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నులు, ఆస్తిపన్ను బకాయిల వసూలు వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించకపోయినా ఏమనుకోరు కానీ టికెట్ ఛార్జీలు పెంచితే తప్పకుండా ఆగ్రహిస్తారు. గుంతలు పడిన రోడ్లు మరమత్తులు చేయించకపోతే నిలదీస్తారు.

పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించి వాటిలో ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ఎవరి కాళ్ళపై వారు నిలబడేలా చేయగలిగితే ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించడం క్రమంగా తగ్గుతుంది.




సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విదంగానే ముందుకు సాగుతున్నారు. కనుక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి దిగిపోయిన వైసీపీ విమర్శలని పట్టించుకోనవసరం లేదు… దాని విమర్శలకు భయపడి ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసుకోనవసరం లేదు.