Chandrababu Naidu You Are Our Trust... Our Future

ఇంతకాలం జగన్మోహన్‌ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తల చేత బలవంతంగా ‘నువ్వే మా నమ్మకం… నువ్వే మా భవిష్యత్‌ జగన్‌’ అనిపింపజేసుకున్నారు. ప్రజలు అనవలసిన ఈ మాటలని స్వయంగా చెప్పుకున్నారు… పైగా వాటికి పోస్టర్స్ కూడా వేసుకున్నారు.

Also Read – రాజకీయ షల్టర్ కావలెను..!

కానీ విచిత్రమేమిటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, సినీ పరిశ్రమ, రాష్ట్రంలోని పరిశ్రమలు, రవాణా, రియల్ ఎస్టేట్, ఆక్వా, డెయిరీ తదితర సంస్థలు, ఇంకా అనేక వర్గాల ప్రజలు ‘నువ్వే మా నమ్మకం… బాబూ’ అని ముక్త కంఠంతో అంటున్నారు. అందరూ ఆయనపైనే కోటి ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు.

ఆ మార్పు నిన్న చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నప్పుడే మొదలైంది.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

జగన్‌ అవమానించిన చిరంజీవి, రజనీకాంత్‌లకు నిన్న ఎంత గౌరవ మర్యాదలు లభించాయో అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ వారి పట్ల ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరూ చూశారు. వేదికపైనే చిరంజీవి, బాలకృష్ణలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అందరూ చూశారు.

ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు రామ్ చరణ్‌ వంటి పలువురు సినీ ప్రముఖుల వద్దకు వెళ్ళి పేరుపేరునా పలకరించారు. ఇవన్నీ సినీ పరిశ్రమకు మళ్ళీ ఏపీలో మంచిరోజులు మొదలయ్యాయని సూచిస్తున్నాయి.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

మూడు రాజధానుల ప్రతిపాదన వలన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బ తింది. పైగా వైసీపి నేతల బెదిరింపులు, ఇసుక మాఫియా, భూకబ్జాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ 5 ఏళ్ళుగా నరకం అనుభవించారు.

కానీ ఇప్పుడు ఏపీకి అమరావతి ఒకటే రాజధాని అని, విశాఖకి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తెచ్చి ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు విస్పష్టంగా ప్రకటించడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి రోజులు మొదలయ్యాయనే చెప్పవచ్చు.

రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమలు, చిన్న మద్య తరహా పరిశ్రమలు కూడా జగన్‌ పాలనలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాయి. దేశంలోనే ఆక్వా రంగంలో ఏపీ నంబర్:1 స్థానంలో ఉంది. జగన్‌ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేసి దానిని కూడా దారుణంగా దెబ్బ తీసింది.

అలాగే గ్రానైట్, సిమెంట్ వంటి పరిశ్రమలు, వైసీపి నేతల వేధింపులు, ఒత్తిళ్ళతో తల్లడిల్లిపోయాయి. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ బాధిత రంగాలలో రవాణా, పాడిపరిశ్రమ కూడా ఉన్నాయి. అవన్నీ చంద్రబాబు నాయుడుపై కోటి ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఐ‌టి రంగాన్ని తెలుగువారు ఏలుతుంటే, ఈ 5 ఏళ్ళ జగన్‌ పాలనలో ఏపీలోని ఐ‌టి కంపెనీలు మూతపడగా మరికొన్ని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రంలో నెలకొన్న అరాచక వాతావరణం, పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటినీ చూస్తున్న పారిశ్రామికవేత్తలు, ఐ‌టి కంపెనీలు, వ్యాపార సంస్థలు ఏపీలో అడుగుపెట్టేందుకు కూడా భయపడుతున్నాయి.

కనుక రాష్ట్రంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, రాష్ట్రానికి రావడానికి భయపడుతున్న పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చంద్రబాబు నాయుడు నమ్మకం కల్పించాల్సి ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ అభివృద్ధి మంత్రమే పటిస్తుంటారు కనుక ఈ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు కనుక ఏపీలో ఐ‌టి రంగానికి కూడా మంచి రోజులు మొదలైన్నట్లే భావించవచ్చు.

జగన్‌ 5 ఏళ్ళ విధ్వంస పాలనలో రాష్ట్రంలోని వ్యవసాయ రంగం దెబ్బతింది. పోలవరం పనులకు ‘రివర్స్ టెండరింగ్’తో బ్రేకులు వేసి నిలిపివేయగా, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించవలసిన నిధులను కూడా సంక్షేమ పధకాలకు మళ్ళించడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. కనీసం ప్రాజెక్టుల గేట్లు మరమత్తులకు నోచుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అటు తిరుమల నుంచి ఇటు అరసవెల్లి వరకు అనేకానేక ప్రసిద్ద పుణ్య క్షేత్రాలు, అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు, ముఖ్యంగా సువిశాలమైన సముద్రతీరం ఉన్నాయి. కనీసం వాటిని అభివృద్ధి చేసుకున్నా రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరేది. రాష్ట్రానికి మంచి పేరు వచ్చేది. కానీ దానినీ జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కనుక దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఈవిదంగా ప్రతీ రంగం చంద్రబాబు నాయుడు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆయన తప్పకుండా తమ సమస్యలని పరిష్కరిస్తారని ‘నువ్వే మా నమ్మకం బాబూ’ అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా వారి ఆకాంక్షల మేరకు పనిచేస్తానని భరోసా ఇస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు చేతిలో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ ఉంది. అది ఏవిదంగా మారబోతోందో త్వరలోనే అందరూ చూడవచ్చు.