Chiranjeevi Comments in Brahma Anandam Pre-release event

కొణిదెల శివ శంకర వర ప్రసాద్ నుంచి మెగా స్టార్ చిరంజీవిగా ఎదగడానికి ఎంతో శ్రమించిన చిరు తన ఇన్నేళ్ల కష్టాన్ని, పేరు ప్రతిష్టలను తన అసందర్భ ప్రేలాపనలతో చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చిరు మీడియా ముందుకొచ్చారు అంటేనే ఎదో ఒక కాంట్రవర్సీ ఉండాల్సిందే అనేలా వ్యవహరిస్తున్నారు.

వయసు పెరిగే కొద్దీ పెద్దరికంగా నడుచుకోవాల్సిన వ్యక్తి ఇలా చౌకబారు మాటలు మాట్లాడుతూ తనతో పాటుగా తన కుటుంబ పరువుని ప్రత్యర్థుల చేతులో పెడుతున్నారు. నిన్న జరిగిన బ్రహ్మానందం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు అసందర్భ ప్రేలాపనలు చేసి విమర్శలను మూటకట్టుకున్నారు.

Also Read – ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!

ఈ కార్యక్రమంలో భాగంగా చిరు తాతగారి ఫోటోను చూపిస్తూ ఆయన గురించి కాస్త వివరించమనగా, ఇక మైక్ అందుకున్న చిరు ఆయన మంచి రసికుడు, ఇంట్లో ఇద్దరు ఉండే వారు, అది చాలక మరో మహిళతో సంబంధాలు కొనసాగించే వారు అంటూ వ్యాఖ్యానించి తన కుటుంబ పరువును, తన మెగా స్టార్ లెగసి ని చేచేతుల తగ్గించుకున్నారు.

ఇలా ఇంటి గుట్టు బయట పెట్టుకోవడం హాస్యం ఎలా అవుతుందో, దాన్ని చమత్కారం అని ఎలా అనుకోవాలో చిరునే బదులివ్వాలి. ఇలా సమయం సందర్భం లేకుండా చిరు లీక్స్ పేరుతో రోజుకో వివాదాస్పద విషయాన్ని మీడియా ముందు పరిస్తే అది వారి కుటుంబ ప్రతిష్ఠకే మాయని మచ్చగా మారుతుంది. అలాగే ఇటు పవన్ కు కూడా అది రాజకీయంగా ఎదురు దెబ్బె అవుతుంది.

Also Read – సనాతన మార్గంలో పవన్ ప్రయాణం తమిళనాడుకే

ఇది జనసేనను ఇరుకున పెట్టడానికి ప్రత్యర్థి పార్టీలు ఒక అస్త్రం గా వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. అలాగే ఇక రామ్ చరణ్ కు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాని, మళ్ళీ ఎక్కడ అమ్మాయి పుడుతుందో అని భయంగా ఉందంటూ, ఇప్పటికే తన ఇల్లు ఆడపిల్ల హాస్టల్ గా మారిందని ఆడ, మగ అనే భేదాన్ని బహిరంగంగా వ్యక్తపరిచి తనకున్నపెద్దరికాన్ని చిన్న బుచ్చారు.

ఈ జనరేషన్ లో అసలు జెండర్ డిఫనెర్స్ అనేది దాదాపు కనుమరుగయ్యిందనే చెప్పాలి. ఎక్కడో మారుమూల పలెటూరుల్లో, చదువు, విజ్ఞానం తెలియని అతి చిన్న, సాధారణ పేద కుటుంబాల సమాజంలో కనిపించే ఈ ఆడ, మగ భేదాన్ని చిరు బహిరంగా చూపించడం అనేక విమర్శలకు దారి తీసింది. ఒక సెలబ్రెటీ హోదాలో ఉంటూ అలా లింగ బేధాలు చూపించే వారికి మార్గ నిర్ధేశం చెయ్యాల్సిన చిరు ఇలా తానే ఆడ పిల్ల వద్దు మగ పిల్లాడే ముద్దు అనేలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం.?

Also Read – కళ్ళు మూసుకుంటానికి హోదా కావాలా.?

దీనితో చిరు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సాధించి మెగాస్టార్ గా అందరికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన వ్యక్తి ఇలా బహిరంగ వేదికల మీద ఆడ,మగ అంటూ వ్యాఖ్యానించడం, మా తాత రసికుడు అంటూ చమత్కరించడం ఎంతమాత్రం సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు.




ఇటువంటి వ్యాఖ్యలను మెగా అభిమానులే కాదు సొంత కుటుంబసభ్యులు కూడా ఆమోదించలేరు. ముఖ్య అతిధిగా వచ్చే గౌరవం దక్కించుకున్న చిరు ఇలాంటి చమత్కారాలు, హాస్యాలు తగ్గించుకోకుంటే రానురాను చిరు స్థాయి సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదాస్పద వ్యాఖ్యల రచ్చకు చిరు బహుశా సంజాయిషీ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుందేమో.?