
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలందరినీ బిఆర్ఎస్ పార్టీ చాలా చక్కగా మేనేజ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రస్తుతం కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్, హరీష్ రావులపై కాళేశ్వరం కేసు, కేటీఆర్‌పై ఎఫ్-1 రేసింగ్ కేసులతో పాటు మరికొన్ని కేసులున్నాయి. వాటిలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసుల విచారణ దాదాపు కొలిక్కి వస్తుండటంతో ఏదో ఓ కేసులో వారి అరెస్టు అనివార్యంగానే కనిపిస్తోంది.
Also Read – అభివృద్ధి అవసరమే.. కానీ డెడ్‌లైన్ 2029
మరోపక్క కల్వకుంట్ల కవిత తిరుగుబాటు ఎపిసోడ్ ఇంకా పూర్తవనే లేదు. ఆమె తెలంగాణ జాగృతి, బీసీ రిజర్వేషన్స్ పెంపు, వాటి కోసం వచ్చేనెలలో రైల్ రోకో చేస్తామంటూ హడావుడి చేస్తూనే ఉన్నారు.
ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని అర్దమవుతూనే ఉంది. కానీ వారు తమ పరిస్థితిపై ఆందోళన చెందకపోగా, తాము గీసిన గీత ప్రకారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుచుకునేలా చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా హైజాక్ చేయగలిగింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతులకు తీరని నష్టం కలిగిస్తోందంటూ హరీష్ రావుతో సహా ఆ పార్టీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుండటంతో, బిఆర్ఎస్ నేతల కేసుల గురించి నిలదీయాల్సిన కాంగ్రెస్ మంత్రులు కూడా బనకచర్ల ప్రాజెక్టు గురించే మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ సృష్టించిన ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ బనకచర్ల గురించి మాట్లాడకపోయి ఉంటే అసలు ఇంత రాద్ధాంతం జరిగేదే కాదు.
Also Read – కవిత గెలుపు బిఆర్ఎస్ ఓటమా.?
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో నేడు భేటీ అయ్యి బనకచర్ల ప్రాజెక్టుని అనుమతించవద్దని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ బలహీనంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గి బనకచర్లపై పోరాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమకు నీళ్ళు తరలించేందుకు సహకరిస్తానని జగన్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారని, అందువల్లే నేడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారని, కానీ ఇపుడు బిఆర్ఎస్ పార్టీయే బనకచర్లని వ్యతిరేకిస్తోందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
అంటే ‘బనకచర్ల ప్రాజెక్ట్’ పేరుతో ఆ రెండు పార్టీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగుతోందని, దానిలో బిఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బనకచర్లపై పోరాటాలు చేయకతప్పలేదని అర్దమవుతూనే ఉంది.
తెలంగాణలో రెండు పార్టీలు రాజకీయ పోరాటాలు చేసుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ మద్యలో బనకచర్ల ప్రాజెక్టుని పెట్టి దాంతో యుద్ధాలు చేసుకోవడం ఎందుకు?