Telangana Talli Idol Change

నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ 9 న అవతరణ దినోత్సవం నిర్వహించి ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ ఆలాపన చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహ రూపురేఖలను రేవంత్ సర్కార్ మార్చి నేడు కొత్తగా ఆవిష్కరించనుంది.

అయితే కాలానికి తగ్గట్టుగా మార్పులు రావడం కొన్నిసార్లు హర్షణీయం, ఆమోదనీయంగా మారితే, అదే మార్పు మరి కొన్నిసార్లు వివాదాలు, విధ్వంసాలను సృష్టిస్తాయి. దీనికి ఏపీలో రాజధాని అమరావతి మార్పు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.

Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!

మార్పు అనేది ప్రస్తుత తరానికి ఇబ్బంది లేకుండా భవిష్యత్ తరానికి వేసే బంగారు బాటలా, రాజ మార్గంలా నిలబడాలే కానీ ఆ రాష్ట్ర ఉనికిని ప్రశ్నించేలా, దాని అస్తిత్వాన్ని కోల్పోయేలా ఉండకూడదు. దీనికి తెరాస గా మారిన బిఆర్ఎస్ పార్టీనే మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

గతంలో జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం దేశానికే ‘అన్నపూర్ణ’గా నిలబడిన ఏపీని అదే దేశ ప్రజల ముందు ‘అనాథ’లా నిల్చో పెట్టి ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ఉనికినే ప్రశ్నించేలా ఉంది అంటున్నారు తెలంగాణ వాదులు.

Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?

ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాష్ట్ర రాజధాని మారాలి అనేలా జగన్ ముందుకెళ్తే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి చీర రంగు మారాలి, రూపం మారాలి అంటూ రేవంత్ ముందుకెళ్లడం ఎంత వరకు సహేతుకం.? దీని వలన రాష్ట్రానికి కలిగే మేలేమిటి.? రాష్ట్ర ప్రజలకు దక్కే ప్రయోజనం ఏమిటి.? ఆలోచించాలి.

గత ప్రభుత్వం డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ ఉనికిని తెలిపే ‘బతుకమ్మ’ దర్శనమిచ్చేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులో ఆ ఉనికి మాయమయ్యింది. మార్పు మోతాదుకు మించి ఉంటే వాటి ఫలితాలు ఏవిధంగా ఉంటాయో ఏపీలో వైసీపీ ని చూస్తే అర్ధమవుతుంది.

Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!

మార్పంటే ప్రజలు హర్షించాలి, దానికి వారి ఆమోద ముద్ర వేయాలి. నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహ రూపు రేఖల మీద ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ విమర్శ చేసింది లేదు, దాన్ని వ్యతిరేకించేలా ప్రకటనలు ఇచ్చింది లేదు. మరి ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది.

ఇలా అనవసరమైన మార్పులు తెచ్చి ఇటు రాష్ట్ర ప్రజల ముందు అటు పొరుగు రాష్ట్రాల ముందు పలుచనవ్వడం తప్ప మరొక ప్రయోజనం లేదు. మార్పు అంటే చంద్రబాబు నాయుడు మాదిరి సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించి అభివృద్ధిలో చూపించాలి, లేదా కేసీఆర్ మాదిరి యాదాద్రి దేవాలయాన్ని నిర్మించి తన మార్క్ నిలుపుకోవాలి.

అంతే కానీ జగన్ తరహా రాజకీయం చేసి మార్పులతో మోనార్క్ గా విమర్శలు ఎదుర్కోకూడదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప సంకెళ్లను బద్దలు కొట్టి దాన్ని ప్రజా భవన్ గా మార్చి ప్రజల మెప్పు పొందారు రేవంత్. ఇటువంటి మార్పులను ప్రజలు హర్షిస్తారు, గౌరవిస్తారు.




కానీ ఇలా తమ ప్రాంతీయతనే ప్రశ్నించేలా, తమ ఉనికినే కోల్పోయేలా ఉన్న మార్పులను ప్రజలు ఎప్పటికి హర్షించరు. అది ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమైనా, కేసీఆర్ తీసుకున్న బిఆర్ఎస్ పేరు మార్పు నిర్ణయమైనా, ఇప్పుడు రేవంత్ తీసుకుంటున్న ఈ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు నిర్మాణమైన చివరికి ఫలితం ఒక్కటే అవుతుంది.