
గత నెల 27న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగం వృద్ధ సింహం గర్జనలా ఉందంటే అతిశయోక్తి కాదు.
Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?
‘ఇక నుంచి కాంగ్రెస్ పార్టీతో యుద్ధమే’ అని ఆ సభలో ప్రకటించిన కేసీఆర్, మళ్ళీ ఫామ్‌హౌస్‌లోకి వెళ్ళిపోయి బయటకు రాలేదు!
కనీసం ఆ సభ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఇక చురుకుగా పని చేస్తుందనుకుంటే కేటీఆర్, కవిత, హరీష్ రావుల మద్య విభేధాలు మొదలయ్యాయంటూ వార్తలు గుప్పుమన్నాయి.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఇటీవల కల్వకుంట్ల కవిత ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, “నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే, నా గురించి పార్టీలోనివారే దుష్ప్రచారం చేయిస్తున్నారు. వారెవరో అందరికీ తెలుసు. కనుక వారిపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్య తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.
ఆమె ఆరోపణ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. కేసీఆర్ కుమార్తెపైనే పార్టీలో దుష్ప్రచారం చేయగల ధైర్యం ఎవరికుంది?ఎవరు వారు?అనే చర్చ మొదలైంది.
Also Read – కేసీఆర్ రాజకీయాలలో పాల్గొనగలరా?
ఇదే సమయంలో హరీష్ రావు పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. వాటిని ఖండించే ప్రయత్నంలో హరీష్ రావు మరో కొత్త విషయం బయటపెట్టారు. “నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని” హరీష్ రావు చెప్పారు.
అయితే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా?అనే కొత్త చర్చ మొదలైంది. ఇంతకాలం కేటీఆర్, హరీష్ రావుల మద్య అభిప్రాయ బేధాల గురించి చర్చ జరుగుతుండేది కానీ ఇప్పుడు కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటనే కొత్త చర్చ మొదలైంది.
హనుమకొండ సభ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి తన విశ్వరూపం చూపిస్తారనుకుంటే అస్త్ర సన్యాసం చేస్తుండటం నిజమే అయితే బిఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బే.
కేసీఆర్ ఇంకా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతుండగానే కేటీఆర్, కవిత, హరీష్ రావుల మద్య ‘కోల్డ్ వార్’ జరుగుతుండటం నిజమే అయితే, కేసీఆర్ తప్పుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు.
ఒకవేళ కేసీఆర్ రాజకీయాల నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలనుకుంటే ఇది తగిన సమయం, సందర్భం కానే కాదు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించి, కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టి కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇప్పుడు తప్పుకుంటే బిఆర్ఎస్ పార్టీని ఆయనే చావు దెబ్బ తీసి వెళ్ళిపోయినట్లవుతుంది.
కేటీఆర్ శుక్రవారం హరీష్ రావు ఇంటికి వెళ్ళారు. కానీ ఆయన్న హటాత్తుగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి ఆయనతో రెండు గంటల సేపు భేటీ అవడం కూడా ప్రజలకు, పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది.
హరీష్ రావుని పార్టీ వీడవద్దని బ్రతిమలాడుకోవడానికో లేదా తమ మద్య విభేధాలు పరిష్కరించుకోవడానీకో కేటీఆర్ వెళ్ళి హరీష్ రావు ఇంటికి వెళ్ళి ఉండవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం విప్ రామచంద్ర నాయక్ అన్నారు. ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అలాగే భావిస్తే నష్టపోయేది ఎవరు?
బిఆర్ఎస్ పార్టీలో ‘ఆల్ ఈజ్ వెల్’ అని ముగ్గురూ కోరస్ పాడుతున్నప్పటికీ, లోపల మరేదో జరుగుతోందని ఇటువంటి సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి.