Cm Arvind Kejriwal

మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ ఆరు నెలల తర్వాత మొన్ననే బెయిల్‌పై విడుదలయ్యారు. కేజ్రీవాల్‌ అంటే ఎప్పుడూ సంచలనమే. జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని అందరూ అనుకుంటే ఆయన ససేమిరా అన్నారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత 48 గంటలలోగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఈరోజు ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ సమావేశంలో బాంబు పేల్చారు!

కేజ్రీవాల్‌ ఏమన్నారంటే, “నేను ఏ తప్పు చేయలేదని సుప్రీంకోర్టు నమ్మింది. నన్ను ఎన్నుకున్న ప్రజలు కూడా నమ్మినప్పుడే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడినాని భావిస్తాను. కనుక పార్టీ నిర్ణయించిన వారికి ఆ బాధ్యతలు అప్పగించి నేను ప్రజల వద్దకు వెళ్ళి వారి తీర్పు కోరుతాను. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాలి. కానీ వాటిని ఈ ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి నిర్వహించాలని ఎన్నికల కమీషన్‌ని కోరుతాను,” అని అన్నారు.

Also Read – జగన్‌, కేసీఆర్‌… ఎప్పుడు బయటకు వస్తారో?

ఈ సందర్భంగా అర్వింద్ కేజ్రీవాల్‌ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. “కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర ముఖ్యమంత్రులపై ఏవో కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి, వారు రాజీనామాలు చేస్తే ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తోంది. నేను అందుకే జైల్లో ఉన్నా రాజీనామా చేయలేదు. కనుక బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ ఈవిషయంలో నా సూచనని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.

అర్వింద్ కేజ్రీవాల్‌ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే, తన పదవిని వదులుకోవడానికి సిద్దమవడం ఆయన రాజకీయ చతురతకి అద్దం పడుతోంది.

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?

మద్యం కేసులో జైలుకి వెళ్ళడం, దాని గురించి మీడియాలో వచ్చిన వార్తలు, విశ్లేషణలు, దుష్ప్రచారం వలన తన ప్రతిష్ట దెబ్బతిందని బాగానే గుర్తించారు. కనుక ఇప్పుడు ఏమీ జరగన్నట్లు ఆ కుర్చీలో కూర్చొని అధికారం చెలాయిస్తే కాంగ్రెస్‌, బీజేపీలకు వేలెత్తి చూపి విమర్శించే అవకాశం ఉంటుంది.

అదే.. పదవికి రాజీనామా చేస్తే ప్రజలలో సానుభూతి ఏర్పడుతుంది. ఆ సానుభూతి ఆమాద్మీ పార్టీని మళ్ళీ తప్పక గెలిపిస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలకు అర్వింద్ కేజ్రీవాల్‌ సిద్దం అవుతున్నారనుకోవచ్చు. ఆయన వ్యూహం ఫలిస్తే ఈసారి కూడా కాంగ్రెస్‌, బీజేపీలను ఆయన చీపురుకట్ట (ఆమాద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం)తో తుడిచేయడం ఖాయం.

Also Read – జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ Vs మెగా ఫాన్స్ – ఎవరికి ఉపయోగం??

ఇక చివరిగా చెప్పుకోవలసిన విషయం మరొకటి ఉంది. ఒకవేళ అర్వింద్ కేజ్రీవాల్‌ నిరాపరాధి అయితే కల్వకుంట్ల కవిత కూడా కడిగిన ఆణిముత్యమే అవుతుందిగా?