Difference in Chandrababu's Experience & Pawan Kalyan's Rage

దక్షిణాది పై ఉత్తరాది ఆధిపత్యం, మా ప్రాంతీయత పై మీ పెత్తనమా, మా మాతృ భాష పై మీ హిందీ భాషా.? అంటూ గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం vs రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్టుగా సాగుతుంది ఈ భాషా వివాదం.

ఈ వివాదాన్ని భుజాన మోస్తూ త్రిభాషా విధానం పై బీజేపీ తో పోరుకు సిద్దమయ్యింది తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వారికి మద్దతు కోసం ఏపీలో వైసీపీ తో, తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ తో రాజకీయ మంతనాలు చేసారు డీఎంకే ప్రభుత్వ పెద్దలు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

ఎన్డీయే లో భాగమైన టీడీపీ మాత్రం త్రిభాషా విధానం పై తమకు ఎటువంటి అభ్యంతరం కానీ అభద్రతా భావం కానీ లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ మిత్ర పక్షాలలో ఒకటైన జనసేన కూడా బీజేపీ హిందీ భాషకు తమ మద్దతు తెలుపుతూనే పొరుగు రాష్ట్రాలతో అనవసర శత్రుత్వాన్ని కొని తెచ్చిపెట్టుకుంటుంది.

నేడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాష విధానం పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాష అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే అని, కేవలం కమ్యూనికేషన్ కోసం వాడే దానితోనే విజ్ఞానం రాదని, మాతృభాషతోనే విజ్ఞానాన్ని సాధించవచ్చని, భాష పై లేనిపోని రాజకీయాలు చేయనని తేల్చిచెప్పారు.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

అలాగే బతుకుతెరువు కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ మాతృభాషను విస్మరించకూడదన్నారు బాబు. ఇప్పటికే మూడు ప్రాంతాల మధ్య వైసీపీ ఆడిన మూడు ముక్కలాటతో రాష్ట్రం ధ్వంశమయ్యినదని, ఇప్పుడు మరో వివాదంతో రాష్ట్ర అభివృద్ధిని మరుగునపడనీయనని, ఏపీ ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడమే తన ధ్యేయమని ఖరాకండీగా చెప్పేసారు సీఎం బాబు.

ఇక ఈ నెల 14 న 12 వ జనసేన ఆవిర్భావ సభా వేదికగా బీజేపీ త్రిభాషా విధానం పై మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల నోటికి ఆహారమయ్యారు. కోరుండి మొట్టికాయలు తిన్నట్టు అసందర్భ వ్యాఖ్యలతో అనవసర వివాదాలలో చిక్కుకున్నారు. హిందీ భాష విధానం పై తన వైఖరిని ఆవిష్కరించిన పవన్ ఇటు వైసీపీ కంటికి అటు డీఎంకే నోటికి చిక్కారు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

దీనితో గతంలో హిందీ భాషా విధానం పై తానూ వ్యాఖ్యానించిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించి పవన్ కు ఊహించని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. అయితే ఈ రెండు సందర్భాలలోనూ పవన్ రెండు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్త పరచడంతో ఆయనకు ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు అనే వాదనను మరోసారి తెరమీదకు తెచ్చారు ప్రత్యర్థి పార్టీల నేతలు.

అయితే త్రిభాష విధానం పై పవన్ కూడా క్లుప్తంగా రెండు ముక్కలతో ముగించి ఉంటే ఇప్పుడీ విమర్శలు ఎదురవ్వకపోవచ్చు. కానీ బీజేపీ నినాదాలను జనసేన గ్లాసులో పోసి తాగించాలనుకోవడం ఫలితంగానే నేడు పవన్ పై ఈ విమర్శల దాడి. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాక తెచ్చినట్టు కేవలం మద్దతు తెలిపితే సరిపోయేదానికి ఎక్కడెక్కడికో వెళ్లి ఇప్పుడు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు.

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అనేలా ఎక్కడ ఎంత మాట్లాడాలో, ఎక్కడ ఎంత తప్పుకోవాలో కూడా రాజకీయాలలో పవన్ కు తెలియాలి, ఖచ్చితంగా తెలిసి తీరాలి. లేకుంటే ఇలా అనవసరమైన వివాదాలలో చిక్కుకుని తనకున్న క్రెడిబిలిటీని, తన పార్టీకున్న నిబద్ధతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.




మొన్న జరిగిన ఒక్క ఆవిర్భ సభ ద్వారానే ఇటు హిందీ భాష పట్ల, అటు గోద్రా అల్లర్ల విషయంలో, ఇక టీడీపీ ని నిలబెట్టాం అనే ప్రకటన వలన పవన్ అందరికి ఈజీ టార్గెట్ అయ్యారు. దీనితో అనుభవానికి, ఆవేశానికి మధ్య ఉండే చిన్న పాటి గీత ఇదే అంటూ బాబు ప్రకటనను, పవన్ ప్రసంగాన్ని జతచేసి చూస్తున్నారు.