Arvind Kejriwal

ఆమాద్మీ పార్టీ ఎన్నికల గుర్తు చీపురు కట్ట. దాంతో అవినీతిని ఊడ్చి పడేస్తామని ప్రజలకు నమ్మకం కలిగించి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారంలోకి రాగలిగారు. కానీ చివరికి అదే అవినీతి కారణంగా బీజేపి ఆ చీపురు కట్టతోనే ఆమాద్మీని ఊడ్చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిజంగా జరిగిందా లేదా?అంటే అదంతా ఓ అభూత కల్పన అని ఆ కేసులో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత వాదిస్తుంటారు.

Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!

ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ని, తెలంగాణలో తమని రాజకీయంగా దెబ్బ తీయడం కోసమే మోడీ ప్రభుత్వం దీనిని సృష్టించిందని ఆమె వాదిస్తుంటారు. అందుకే తనని అన్నిసార్లు ప్రశ్నించినా, సుమారు ఆరు నెలలపాటు జైల్లో పెట్టినా, సీబీఐ, ఈడీ తన నుంచి ఒక్క రూపాయి రికవరీ చేయలేకపోయాయని, అవినీతికి పాల్పడ్డానని నిరూపించలేకపోయాయని వాదిస్తుంటారు.

ఆమె వాదనలను సీబీఐ, ఈడీ, ప్రధాని మోడీతో సహా అందరూ వింటూనే ఉన్నారు. కానీ అందరూ మౌనంగా ఉండిపోయారు. ఈ కేసు అటకెక్కిపోవడం గమనిస్తే ఆమె వాదనలు నిజమే అని అనుమానించాల్సి ఉంటుంది.

Also Read – ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!

“ఒకప్పుడు దేశానికి బియ్యం, గోధుమలు, వీర సైనికులను అందించిన పంజాబ్‌ రాష్ట్రం ఇప్పుడు మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారింది. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే ప్రతీరోజూ పంజాబ్‌ నుంచి క్యాన్సర్ రోగులతో నిండిన ఓ రైలు ఢిల్లీకి వస్తుంటుంది.

సమాజానికి చీడ పట్టినప్పుడు చూస్తూ ఊరుకోవాలా? తగిన ట్రీట్‌మెంట్‌ చేసి కాపాడుకోవాలా? ప్రధాని మోడీ అదే చేస్తున్నారిప్పుడు,” అని సిఎం చంద్రబాబు నాయుడు మాటలు ఆలోచింపజేస్తున్నాయి. ఢిల్లీ తర్వాత మోడీ, అమిత్ షాల తదుపరి టార్గెట్ పంజాబ్‌ అని సూచిస్తున్నట్లున్నాయవి.

Also Read – ఒకరిది భాషోద్వేగం..మరొకరిది ప్రాంతీయవాదం..మరి ఏపీ.?

అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇది గ్రహించారు. అందుకే నిన్న పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, మంత్రులతో సమావేశమయ్యి పంజాబ్‌లో పరిస్థితిని సమీక్షించారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ నిజంగా లిక్కర్ స్కామ్ చేశారా లేదా?అని దర్యాప్తు సంస్థలు తేల్చిచెప్పలేకపోయాయి. కానీ చేశారని బీజేపి ఢిల్లీ ప్రజలను నమ్మించగలిగింది. అందుకే ఆయనతో సహా ఆమాద్మీ పార్టీ కూడా ఓడిపోయింది! రాజకీయాలలో ఇదో కొత్త ట్రెండ్ అనుకోవచ్చు.

జగన్‌ కూడా స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసి ఇటువంటి ప్రయోగమే చేశారు. కానీ అది బెడిసికొట్టడంతో ఆ దెబ్బకు జగనే అధికారం కోల్పోగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

కనుక ఈ ప్రయోగం ఎప్పుడు ఎక్కడైనా జరిగే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వంతో సహా ప్రతీ ఒక్కరూ గ్రహించి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.




దర్యాప్తు సంస్థలు రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసిన తర్వాత రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి విచారణ పూర్తి చేయకపోవడం, మద్యలో చల్లబడిపోవడం వలననే ఇటువంటి రాజకీయ పరిణామాలకు ఆస్కారం కలుగుతుంది. గొడ్డలి వేటుతో చనిపోయిన వివేకా, గుండెపోటుతో చనిపోయారని నిందితులు వాదించినా సీబీఐ ఏం చేయగలిగింది? అది గుండెపోటు కాదు గొడ్డలివేటు అని ప్రజలకు తెలిసింది. కానీ సీబీఐ నిరూపించి హంతకులకు శిక్షలు పడేలా చేయలేకపోయింది. చేసి ఉంటే ఏపీ రాజకీయాలలో 5 ఏళ్ళ పాటు ఇంత అరాచకం జరిగి ఉండేదా?