
రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు ఎటువంటి తప్పులు చేయకూడదో తెలుసుకునేందుకు 5 ఏళ్ళ జగన్ విధ్వంస పాలన ఓ ఎన్సైక్లోపీడియాగా వాడుకోవచ్చు.
జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెడతారనుకుంటే, తొలి రోజు నుంచి అధికారంలో నుంచి దిగిపోయేవరకు ప్రతీ నిర్ణయమూ చంద్రబాబు నాయుడుపై కక్షతోనే తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు పట్ల జగన్కు అంత ద్వేషం ఉండటం, అది ఆయన నిర్ణయాలు, విధానాలు, పాలనపై అంతగా ప్రభావం చూపడం చాలా ఆశ్చర్యకరమే.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
ఆ కక్ష్యలో భాగంగానే కూల్చివేతలు, మూసివేతలు, పేర్లు, రంగుల మార్పులు ఓ మహా యజ్ఞంలా చేశారు. జగన్ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అనేక సంస్థలకు, రోడ్లకు చివరికి సముద్ర తీరంలో వ్యూ పాయింట్లకు కూడా వైఎస్సార్ పేరుతో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇటువంటి పిచ్చి పనుల ద్వారా రాష్ట్రంలో వైసీపీ తప్ప మరొకటి లేదు.. ఉండదు.. ఉండకూడదన్నట్లు ప్రజలకు బ్రెయిన్ వాష్ చేసి వైసీపీవైపు మొగ్గు చూపేలా చేయాలనుకున్నారు.
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
అదే.. జగన్ అమరావతి, పోలవరం నిర్మాణాలు కొనసాగిస్తూ పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉండి ఉంటే ప్రజలు తప్పకుండా వైసీపీవైపే మొగ్గుచూపి ఉండేవారు.
కానీ విజయానికి షార్ట్ కట్స్ ఉండవని గ్రహించని జగన్ 5 ఏళ్ళపాటు ఇదే యావలో కొట్టుకుపోయారు. దానికి మూల్యం చెల్లించారు.
Also Read – కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ సరిచేయడానికే వందల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం బాధాకరమే. కానీ తప్పడం లేదు.
తమ తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేస్తుంటే వైసీపీ నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. కానీ నిసిగ్గుగా ప్రెస్మీట్ పెట్టి మరీ కూటమి ప్రభుత్వ చర్యలను తప్పు పడుతున్నారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం మా మీద కక్షతో వైఎస్సార్ పేరుని, విగ్రహాలను తొలగించగలదేమో కానీ ప్రజల గుండెల్లో నుంచి ఆయనని ఎప్పటికీ తొలగించలేదు. కూటమి నేతలకు ఆ స్థాయి, అర్హత రెండూ లేవు,” అని అన్నారు.
ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి గురించి మళ్ళీ వారికి గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. దాని కోసం వైఎస్సార్ పేర్లు పెట్టాల్సిన అవసరమే లేదు కదా?
అధికారంలో ఉన్నవారు ఇలా అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ మార్పులు, చేర్పులు చక్కటి నిదర్శనం.
కనుక కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటివాటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఏదైనా సంస్థకు పేరు పెట్టాల్సివస్తే భవిష్యత్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పేర్లని మార్చే సాహసం కూడా చేయలేని ప్రముఖుల పేర్లు లేదా రాజకీయాలకు సంబంధం లేనిపేర్లు పెడితే మంచిది. లేకుంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలాగే పేరు మార్పిడి పనులకే వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుంది.