Harish Rao Powepoint Presentation

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ‘బనకచర్ల ప్రాజెక్ట్’ని బిఆర్ఎస్ పార్టీ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటోందని ఇది వరకే చెప్పుకున్నాము.

శనివారం తెలంగాణ భవన్‌లో “బనకచర్ల ప్రాజెక్ట్ పేరిట ఏపీ చేస్తున్న జల దోపిడీ-కాంగ్రెస్‌ మౌనం” అనే అంశంపై మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Also Read – హిందీ భాష పై బాబు స్పందన…

“కేంద్ర ప్రభుత్వం ఏపీకి మాట సాయం.. మూట సాయం చేస్తోందని, ఎటువంటి అనుమతులు లేని ‘బనకచర్ల ప్రాజెక్ట్’ కేంద్రం సహకరిస్తుంటే, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా సిఎం రేవంత్ రెడ్డి చేతులు ముడుచుకొని మౌనంగా చూస్తున్నారు.

ప్రధాని మోడీ, సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపిలకు చెరో 8 మంది ఎంపీలున్నా ఆంధ్రా జల దోపిడీని, బనకచర్లని అడ్డుకోవడం లేదు,” అని హరీష్ రావు ఆరోపించారు.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

ఒకవేళ తెలంగాణ ఎగువన ఏపీ ఉండి, నదులపై ప్రాజెక్టులు కట్టి నీళ్ళు మళ్ళించుకుపోతుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదించినా అర్దం ఉంది. కానీ తెలంగాణకు ఎగువన మహారాష్ట్ర, దిగువన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి.

మహారాష్ట్రలో కడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పాల్సిన బిఆర్ఎస్ పార్టీ వాటి గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. కానీ దిగువన సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని ఆంధ్రప్రదేశ్‌ దోపిడీ చేస్తోందని హరీష్ రావు వాదించడం రాజకీయం కాదా?

Also Read – జగన్‌ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?

బనకచర్ల పేరుతో రాజకీయాలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాము మాత్రమే కాపాడగలమని చెప్పుకుంటూ ప్రజలను ఆకర్షిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.

అయితే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేంద్రంతో కయ్యాలాడుతూ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించుకున్నారు కదా? కానీ ఆ తప్పుని కూడా తెలివిగా ‘రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందనే’ వాదనలతో కప్పి పుచ్చుకున్నారు!

కాళేశ్వరం కట్టి తెలంగాణ రాష్ట్రం అంతటా నీళ్ళు పారించి రైతులకు ఎంతో మేలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ లక్ష కోటు పెట్టిన ఆ ప్రాజెక్టు క్రుంగి పోయి, బీటలు వారడంతో ఎందుకు పనికి రాకుండా పోయింది కదా?

దానిలో కేసీఆర్‌ & కో వేలకోట్ల అవినీతికి పాల్పడటం వలననే కట్టిన మూడేళ్ళకే క్రుంగిపోయిందంటూ రేవంత్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ వేసి విచారణ జరిపిస్తోంది కదా?

కోట్లాడి సాధించుకున్న తెలంగాణకు ఇంత నష్టం లేదా అన్యాయం చేసిన కేసీఆర్‌ & కో, తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రధాని మోడీ, సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిపై బురద జల్లాడానికి వెనకాడటం లేదు.

తద్వారా తెలంగాణ ప్రజలను ఆకట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ఆశ పడుతున్నారు. కానీ కుదరక పోతే బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయాలనుకుంటున్నారని కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితే చెప్పారు కదా?

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులపై ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్, ధరణి ఇంకా చాలా కేసులు నడుస్తున్నాయి. కనుక వాటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్‌ & కో జైలుకి వెళ్ళక తప్పేలా లేదు.




ఒకవేళ ఈ కేసులలో చిక్కుకుంటే వాటి నుండి బయటపడేందుకు బీజేపిలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారన్న మాట. ఇలాంటి బిఆర్ఎస్ పార్టీ నేతలా.. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది? ప్రధాని మోడీని, సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించేది?