Free Bus Service to Women

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పధకం ద్వారా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి టిజిఎస్ ఆర్టీసీకి కష్టాలు మొదలయ్యాయి.

ఆ మేరకు ఆర్టీసీ ఆదాయం కోల్పోవడం, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఆ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించలేకపోతోంది.

Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?

కనుక అంతవరకు టిఎస్ ఆర్టీసీయే ఆ అదనపు భారం భరించాల్సి వస్తోంది. మరోపక్క మహిళా ప్రయాణికులు గణనీయంగా పెరగడంతో ఉన్న బస్సులు సరిపోక, కొత్త బస్సులు కొనలేక ఇబ్బంది పడుతోంది. మహిళా ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోవడంతో ఉద్యోగులపై పని భారం విపరీతంగా పెరిగిపోయింది. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లు ఆదాయం తగ్గిపోయింది. ఇలా.. ఒకటా రెండా.. అనేక సమస్యలు పేరుకుపోయాయి.

కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్‌లోని ఈ పధకం అమలుచేయడానికి తొందరపడకుండా తెలంగాణతో సహా వివిద రాష్ట్రాలలో ఏవిదంగా ఈ పధకం అమలవుతోందో అధికారులను పంపించి అధ్యయనం చేయించారు.

Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్‌ పట్టించుకోవట్లేదే!

ఆ నివేదికలన్నీ చూసిన తర్వాతే సిఎం చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ప్రకటించారని భావించవచ్చు.

కానీ ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించనప్పుడు, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా పూర్తిగా ఉచితం కాదనే చెప్పాలి. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.3,182 కోట్లు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అది ఏటా మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు.

Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!

ప్రభుత్వం ఆ భారం భరిస్తుందని చెపుతున్నప్పటికీ, ఆ భారాన్ని పెంచిన పన్నులు, ధరలు, చార్జీల రూపంలో ప్రజలే భరించాల్సి ఉంటుంది. అదే.. మహిళకు టికెట్ ఛార్జీలపై 25 లేదా 50 శాతం రాయితీ ఇస్తే వారూ సంతోషిస్తారు.. ప్రజలపై ఆ మేరకు భారం తగ్గుతుంది కదా? కానీ 100 శాతం ఉచిత ప్రయాణం అంటే 100 శాతం భారం ప్రజలపైనే పడుతుందిగా?

రాష్ట్రంలో ప్రతీరోజు సుమారు 16.40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారు. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆ సంఖ్య మరో 4-5 లక్షలు వరకు పెరుగుతుంది. కనుక ఆ మేరకు ఆర్టీసీపై, ఉద్యోగులపై, ప్రభుత్వంపై అదనపు భారం తప్పదు.

ఎన్నికల హామీలు అమలుచేయక తప్పదు లేకుంటే వైసీపీ కాకిలా పొడుస్తూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 11 నెలలు పూర్తయింది. మరో నెలలో ఏడాది పూర్తవుతుంది. కనుక ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సంక్షేమ హామీలు/పధకాలు అమలు చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ అని అనిపించుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయినట్లే ఉన్నారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఉచిత సిలిండర్లు సొమ్ము ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతోంది. అలాగే తల్లికి వందనం పధకం కూడా బడులు తెరిచేసరికి ప్రారంభించబోతోంది. తాజాగా ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా అమలుచేయబోతోంది.




కనుక ఈ అదనపు భారాన్ని సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ, దానిని మోసేందుకు ఆర్టీసీ సంస్థ, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ సిద్దం కాక తప్పదు.