Tollywood Industry

బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవారికి పంచింగ్ బ్యాగ్ ఉంటుంది. దానిని పంచింగ్ చేస్తూ వారు తమ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మన తెలుగు సినీ పరిశ్రమ కూడా అందరికీ వినోదం పంచుతూ దెబ్బలు తింటున్న ఓ పంచింగ్ బ్యాగ్ వంటిదే అని చెప్పక తప్పదు.

అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి సోషల్ మీడియా వారియర్స్, హీరోల అభిమాన సంఘాలు, సినీ విమర్శకులు చివరికి సినీ పరిశ్రమలో ఉన్నవారి చేతిలో కూడా సినీ పరిశ్రమ ‘పంచింగ్ బ్యాగ్’లా దెబ్బలు తింటూనే ఉంది.

Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?

పుష్ప-2, అల్లు అర్జున్‌ విషయంలో జరిగిన రాద్దాంతం చూసినప్పుడు సినీ పరిశ్రమ రాజకీయ పార్టీలకు ఎంత లోకువో అర్దమవుతుంది.

గేమ్ చేంజర్‌పై జరుగుతున్న దుష్ప్రచారం, అది ఎదుర్కొంటున్న సమస్యలు చూసినప్పుడు, ప్రతీ సినిమాకి ఓ పెద్ద యుద్ధం చేయక తప్పదని అర్దమవుతుంది.

Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..

సినీ పరిశ్రమలో ఉన్నవారు ఎంత పెద్ద హీరోలైనప్పటికీ, ఎన్ని వందల కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నప్పటికీ అందరూ అందరికీ లోకువే అని అర్దమవుతుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సస్ మీట్‌లో నిర్మాత శిరీష్ మాట్లాడుతూ, “ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ ఒక్క సినిమా మీ కష్టాలన్నీ తీర్చేసి ఒడ్డున పడేస్తుందని అనిల్‌ రావిపూడి చెపుతూనే ఉన్నారు. మేము బావిలో పడిపోతున్నామని చాలా మంది సంతోషిస్తుంటే, అనిల్‌ రావిపూడి మమ్మల్ని ఆ బావిలో నుంచి బయటకు తీసి వారి పక్కనే కూర్చోబెట్టాడు. ఇందుకు మేము ఆయనకు చాలా రుణపడి ఉంటాము,” అని అన్నారు. అంటే ఓ నిర్మాత నష్టపోతుంటే ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా చాలా సంతోషిస్తున్నారన్న మాట.

Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?

ఇక మంచు సోదరులు ఇద్దరూ ఒకరినొకరు ‘కుక్క’ అని తిట్టుకుంటూ, పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకుంటున్నారు. మంచు విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’ సినిమా ఫ్లాప్ అయిపోవాలని సొంత తమ్ముడు శాపాలు పెడుతున్నాడు!

గతంలో తాను చేసిన సినిమాని దెబ్బ తీసేందుకు ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడు టీమ్‌ ఏర్పాటు చేశారని మంచు విష్ణు సంచలన ఆరోపణ చేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే సినీ పరిశ్రమలో వారే ఒకరినొకరు కుళ్ళ బొడుచుకుంటున్నారన్న మాట!

డాకూ మహరాజ్ సక్సస్ మీట్‌లో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, “మన సినిమాలను యావత్ దేశం, ప్రపంచదేశాలు గుర్తించి ఆదరిస్తుంటే, మనమే మన సినిమాలను అవహేళన చేసుకుంటూ, దెబ్బ తీసుకుంటున్నాము.

ముఖ్యంగా కొందరు చేస్తున్న ట్రోలింగ్‌తో మేమందరం ఎంతగా బాధపడతామో, ఆ ప్రభావం మాపై ఎంతగా ఉంటుందో ఎవరూ గ్రహించడం లేదు. సినీ పరిశ్రమలో వారందరికీ, పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ నిర్మాతలే అన్నం పెడుతున్నారు. అటువంటి నిర్మాతలను, వారి సినిమాలను కాపాడుకోవాలి. కానీ మనమే దెబ్బ తీస్తున్నాం. మన సినిమాలు ఆస్కార్ స్థాయికి ఎదిగినప్పుడు దానిని కిందకు లాగాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?”అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూనే టాలీవుడ్‌ అందరినీ అలరించేందుకు రేయింబవళ్ళు శ్రమిస్తూనే ఉంది. పైకి దగధగాయమానంగా వెలిగిపోతూ అందరికీ వినోదం పంచుతున్న మన తెలుగు సినీ పరిశ్రమకి, తెర వెనుక ఇన్ని సమస్యలు, ఇన్ని అవమానాలు ఉన్నాయంటే చాలా బాధ కలుగుతుంది.