
బారీ బడ్జెట్‌తో పెద్ద హీరో సినిమాపై చాలా భారీ అంచనాలు ఉంటాయి. కానీ సినిమాలో సరుకు లేకపోతే ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తుంటారు. రోబో-1 సినిమాకి బ్రహ్మరధం పట్టిన ప్రేక్షకులే రోబో 2.0ని తిరస్కరించారు. కనుక సినిమాలకు కధ (సరుకు) చాలా ముఖ్యమని నిర్మాత దిల్‌రాజు చెప్పేశారు.
రాజకీయాలకు కూడా ఈ ఫార్ములా వర్తిస్తుంది. బారీ అంచనాలతో ప్రజల ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలే 2.0 వద్దంటూ దించేశారు. కానీ 2.0 తప్పక ఉంటుందని, ఆ తర్వాత మరో 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ నమ్మబలుకుతున్నారు.
Also Read – మంచు ఫ్యామిలీ వార్: ఇక్కడ కూడానా…?
అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ ఇవ్వని జగన్ ఇప్పుడు కార్పొరేటర్లు, వార్డు మెంబర్లని కూడా తాడేపల్లి ప్యాలస్‌కి పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు!
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఏలూరు, తునిలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలు ఫిరాయించినందున, విజయవాడ కార్పొరేటర్లు కూడా ఎక్కడ చేజారిపోతారో అనే భయంతోనే జగన్ తమతో సమావేశమయ్యారని వారికీ తెలుసు.
Also Read – ఈయనకి ఎవరైనా కాస్త చెప్పండర్రా!
అధికారంలో ఉన్నప్పుడు ‘175 కి 175 సీట్లు మనవే.. మరో 30 ఏళ్ళు నేనే…’ అంటూ పార్టీలో అందరినీ నమ్మించి నిలువునా ముంచేసిన జగన్, ఇప్పుడు 2.0 అంటూ మళ్ళీ మభ్య పెడుతుంటే క్షేత్రస్థాయి రాజకీయాలలో డక్కామొక్కీలు తిని రాటు తేలిన వైసీపీ నేతలకు అర్దం కాదని జగన్ అనుకుంటున్నారా?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలని పక్కన పెట్టేసి లక్షల మంది వాలంటీర్లను నియమించుకొని నెలనెలా జీతాలు, ఏటా బోనసులు చెల్లించేవారు.
Also Read – ఓటమి ఒప్పుకోవడం, బాధ్యత వహించడం చంద్రబాబుకే చెల్లు!
“ఇక్కడ నేను బటన్ నొక్కుతుంటాను.. మీరు వెళ్ళి ప్రజలకు డబ్బులు పంచి పెడుతుండండి… మద్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ అవసరం లేదన్నట్లు వ్యవహరించిన జగన్, ఇప్పుడు 2.0 లో కార్యకర్తలని పట్టించుకుంటానని నమ్మబలుకుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలని, ఓడిపోయిన తర్వాత వాలంటీర్లను పట్టించుకోని జగన్ చెప్పే మాటలను ఏ వైసీపీ కార్యకర్త అయినా నమ్ముతాడా?
తమని పట్టించుకోని జగన్, ఇప్పుడు తన కోసం జైలుకి కూడా వెళ్ళి రమ్మంటున్నారు కదా?ఎందుకు వెళ్ళాలి? అని కార్యకర్తలు అడుగుతారని జగన్‌కి బాగా తెలుసు.
అందుకే మరో కట్టుకధ అల్లి, “1.0లో నేను ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తూ వారికి ఏవిదంగా మేలు చేయాలనే ఆరాటంలో మీ అందరినీ మరిచిపోయాను. కానీ ఇప్పుడు మీరందరూ నాకోసం జైలుకి వెళ్ళి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే ఈసారి మిమ్మల్ని మర్చిపోను,” అని జగన్ నమ్మబలుకుతున్నారు.
ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ అందరినీ మారిచిపోయానని జగన్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ 5 ఏళ్ళలో నిత్యం చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలు, కార్యకర్తలని ఎవరినీ విడిచిపెట్టకుండా వేధించారు కదా?పవన్ కళ్యాణ్‌ని మానసికంగా, నైతికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు చేయకూడని పనులన్నీ చేశారుగా?
ప్రత్యర్ధులని దెబ్బ తీయడానికి కేటాయించిన సమయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, కార్యకర్తల కోసం కేటాయించి ఉంటే నేడు జగన్ పరిస్థితి, ఆయనని నమ్ముకున్నవారి పరిస్థితి ఈవిదంగా ఉండేదా?
అసలు జగన్ అహంభావం, విచిత్రమైన ధోరణి, అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిందని వైసీపీలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ తన అసమర్దతకి, వైఫ్యల్యాలకు పార్టీ ఎమ్మెల్యేలను బాధ్యులుగా చేసి చివరి నిమిషంలో వారికి టికెట్స్ నిరాకరించి బలి పశువులు చేశారు కదా?
సొంత తల్లి, చెల్లి, నమ్ముకున్న విజయసాయి రెడ్డి, మేకపాటి, ఆనం, కోటంరెడ్డి వంటివారందరూ తనని వదిలి ఎందుకు వెళ్ళిపోయారో జగన్ చెప్పగలరా?
ఈవిదంగా సొంత కుటుంబ సభ్యులతో సహా పార్టీలో పై నుంచి క్రింద వరకు ప్రతీ ఒక్కరినీ మోసం చేసిన జగన్‌ని మేము ఎందుకు నమ్మాలి? అని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచించుకోవలసిన సమయం ఇదే. కాదని జగన్ చెప్పే 2.0 నమ్మితే వారి రాజకీయ జీవితాలకు వారే సమాధులు కట్టుకొంటున్నట్లే!