Jagan KTR

ఫోన్ టాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలను పరిశీలిస్తే ఇక్కడ షర్మిల, అక్కడ కవిత ఇద్దరు రాజకీయ బాధితులుగా, సొంత కుటుంబ సభ్యుల చేత మోసపోయిన నిర్భాగ్యులుగా కనిపిస్తుంటే,

అటు జగన్ ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా రాజకీయాలలో బంధాలకు బంధుత్వాలకు చోటు లేదు అనే సామెతను ఆచరణలోకి తెచ్చిన పక్క రాజకీయ నాయకుల మాదిరి తోస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరోలెక్క అన్నట్టుగా ఫోన్ టాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గేమ్ ఛేంజర్ కానుంది.

Also Read – కవిత మరో లేఖ…

ఒక్క కేసు ఎన్నో రాజకీయ లెక్కలకు సమాధానం చెపుతుంది, అలాగే ఎన్నో రాజకీయ కుట్రలను బయటకు తెస్తుంది. ఇన్నాళ్ళుగా తెరచాటు రాజకీయం నడిపిన రెండు పార్టీల భాగోతాన్ని, ఇద్దరు వ్యక్తుల భాగస్వామ్యాన్ని ఈ కేసు బయటకు తెస్తుంది.

అయితే ఏపీలో వైస్ జగన్ విషయానికొస్తే తండ్రి పేరు అడ్డుపెట్టుకుని పార్టీ పెట్టి తల్లి, చెల్లిని అడ్డుపెట్టి సానుభూతి సంపాధించి చివరికి అదే తల్లిని పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. చెల్లిని పార్టీ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తరిమికొట్టారు.

Also Read – పరామర్శకు తలకాయలు.. రాజకీయాలకు మామిడి కాయలు!

తండ్రి మరణంతో పుట్టిన పార్టీ ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా ఎగిరి తల్లి రాజీనామాతో, చెల్లెల జరిమానాతో అంతే స్థాయిలో వెనక్కి వెళ్ళింది. ఇక్కడ జగన్ కూడా తానూ రాజకీయంగా ఎదిగే వరకు , తన వైసీపీ పార్టీ రాష్ట్రంలో బలోపేతం అయ్యే వరకు తల్లిని, చెల్లిని తన రాజకీయానికి కవచ కుండలాలుగా పెట్టుకున్నారు.

ఒక్కసారి తనకు ఆశించిన స్థాయి, తన పార్టీకి ఊహించిన స్థానం దక్కగానే తల్లిని పార్టీ దూరం చేసారు, చెల్లిని పక్క రాష్ట్రానికి బదిలీ చేసారు. అలాగే షర్మిల ప్రతి అడుగు మీద నిఘా పెట్టారు, ప్రతి కదలిక మీద శ్రద్ద పెట్టారు.

Also Read – బైజూస్ కాదు.. మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్.. ఇదే అవసరం!

ఇక ఇప్పుడు కేటీఆర్ విషయానికొస్తే తండ్రి అధికారంలో ఉన్న పదేళ్లు పార్టీ బాధ్యతలతో పాటుగా ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు, పార్టీలో నెంబర్ 2 స్థానం వరకు ఎదిగారు. అయితే ఆ సమయంలో చెల్లి కవితకు ప్రభుత్వంలో ఎటువంటి పదవి దక్కలేదు, పార్టీలో కేటీఆర్ కు సమానమైన ప్రాతినిధ్యం కవితకు అందలేదు.

అలాగే బిఆర్ఎస్ రెండవ సారి కూడా అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ ఆ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా కవిత ఓటమి చెందారు. అయితే ఆ ఓటమి కి కూడా బిఆర్ఎస్ పెద్దల కనుసన్నలలో జరిగిన అంతర్గత రాజకీయమే కారణం అనే ప్రచారం నడిచింది.

అయితే నాడు వైసీపీ లో కూడా ఇదే తరహా వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పొందింది. ఇక్కడ బాధితురాలిగా జగన్ తల్లి విజయమ్మ నిలిచారు. విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేసిన జగన్ తల్లి విజయలక్ష్మి అనూహ్యంగా ఓటమిని మూటకట్టుకుంది. వైసీపీ వేవ్ లో కూడా విజయమ్మ ఓడిపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పట్టికి, ఆ ఓటమి అవమానం వెనుక జగన్ ఉన్నారన్నది రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

ఇక ఇప్పుడు వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఓటమిని మూటకట్టుకుని, రాష్ట్ర రాజకీయాలలో తమ పట్టు నిలుపుకోవడానికి పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ బిఆర్ఎస్ ఓటమి నాటి నుంచి నేటి వరకు పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా మూగబోయారు.

అయితే ఈయన మౌనం వెనుక ఈయన అజ్ఞాత జీవితం వెనుక ఓటమి భారమేనా.? మరేఇతర సమస్యైనా ఉందా అన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వారు గతంలో ఏపీలో నడిచిన వైసీపీ రాజకీయాలను సరిపోలుస్తున్నారు.

నాడు జగన్ తల్లిని పార్టీకి దూరంగా జరిపారు, నేడు కేటీఆర్ తండ్రిని బిఆర్ఎస్ కు దూరం చేస్తున్నారా.? పార్టీ పై పూర్తి ఆధిపత్యం సాధించడానికి, తనను తానూ ఒక ఒక పార్టీ అధినేతగా నిరూపించుకోవడానికి ఈ ఓటమి సంక్షోభాన్ని కేటీఆర్ అడ్డుపెట్టుకుంటున్నారా.?

అందుకు అడ్డుగా గళం వినిపించే సొంత వారిని రాజకీయంగా అడ్డు తొలిగిస్తున్నారా.? నాడు వైసీపీ లో షర్మిలకు జరిగిన పరిణామాలే నేడు బిఆర్ఎస్ లో కవిత ఎదురుకుంటున్నారా.? వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అనేలా జగన్ వైసీపీలో వైఎస్ కుటుంబం నుంచి మరో పేరు లేకుండా చేసినట్టు, కేటీఆర్ కూడా బిఆర్ఎస్ పై పూర్తి పట్టు కోసం సొంత కుటుంబసభ్యులతో అంతర్గత రాజకీయ యుద్ధం చేస్తున్నారా.?




జగన్, కేటీఆర్ వీరిద్దరి అంతిమ లక్ష్యం తమ రాజకీయ ఎదుగుదల కోసం సొంత చెల్లెళ్లను దూరం చేసుకోవడమా.? లేక పార్టీలో తమ గుర్తింపు, గౌరవాల కోసం సొంత తల్లి, తండ్రులను పార్టీలకు దూరం చేయడమా.?