కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సింహంలా గర్జించేవారు. కారణాలు ఏవైతేనేమి ఆయన ఇప్పుడు గడప దాటి బయటకు రావడం లేదు. కనుక శాసనసభ సమావేశాలలో కేటీఆర్, హరీష్ రావులే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. నేడు వారి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ధర్నా జరిగింది. దానిని పోలీసులు భగ్నం చేశారు.
Also Read – బాలినేని చెప్పబోయే ఆ గండికోట రహస్యాలు ఏమిటో?
సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు శాసనసభలో తమ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు, జాబ్ క్యాలండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు నిరసన చేస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది.
ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమని పోలీసులతో అరెస్టు చేయిస్తోందంటూ కేటీఆర్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళి రాహుల్ గాంధీతో కూడా పోరాడుతామని ట్విట్టర్‌లో చెప్పుకున్నారు.
Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!
అయితే నిన్న వారి సమక్షంలోనే శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం ‘జాబ్ క్యాలండర్’ విడుదల చేసింది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు ఖాళీలు ప్రకటిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. కనుక కేసీఆర్ పదేళ్ళలో చేయని పనిని రేవంత్ రెడ్డి కేవలం 7 నెలల్లోనే చేసి చూపుతోందని అనుకోవచ్చు.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయపార్టీలు ఏవిదంగా చురుకుగా ఉండాలో బిఆర్ఎస్ పార్టీ ఆచరణలో చూపిస్తోంది. కనుక ప్రతిపక్షాలు ప్రజాసమస్యల పేరుతో పోరాటాలు చేస్తున్నప్పటికీ అవి వాటి ఉనికిని చాటుకోవడానికి, మనుగడని కాపాడుకోవడానికి, పార్టీ శ్రేణులను యాక్టివ్‌గా ఉంచడానికి, రాజకీయంగా అధికార పార్టీపై పైచేయి సాధించడానికి కూడా ఇటువంటి పోరాటాలు అవసరమని భావించవచ్చు.
Also Read – బాలినేని ఈ సారి ‘రాజీ’ పడలేదు..!
ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయినప్పటికీ, టీజీపీఎస్‌ఎస్సీ సక్రమంగా పరీక్షలు నిర్వహించలేక అభాసుపాలైనప్పటికీ, ఉద్యోగాల కోసం బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం హాస్యాస్పదంగానే ఉన్నప్పటికీ, పార్టీ మనుగడ దృష్ట్యా అది సరైన దిశలోనే పయనిస్తోందని చెప్పవచ్చు.
ఇక శాసనసభ సమావేశాలకే మొహం చాటేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఇటువంటి ధర్నాలలో పాల్గొంటారని ఆశించలేము. కనుక ఆయన ఫామ్‌హౌస్‌కి పరిమితమవుతూ, కొడుకు కేటీఆర్‌కి దిశానిర్దేశం చేస్తూ క్రమంగా పార్టీ పగ్గాలనుఅప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు.
ఇక చివరిగా తప్పక చెప్పుకోవలసిన విషయం: తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం ఆ పార్టీ నేతలు శాసనసభలో బయటా కూడా పోరాటాలు చేస్తున్నారు.
కానీ ఏపీలో జగన్ శాసనసభకు రాలేదు. కనీసం ప్రజల మద్యకు కూడా రావడంలేదు. తాడేపల్లి ప్యాలస్-పులివెందుల ప్యాలస్-బెంగళూరు ప్యాలస్ మద్య తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలస్ తిరిగివచ్చిన జగన్ శుక్రవారం మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. ఈ విషయంలో జగన్ కేటీఆర్‌ని ఆదర్శంగా తీసుకొని పనిచేయవచ్చు. కానీ పాపాల చిట్టా చాలా పెద్దదిగా ఉండటం, కేసుల భయం, ప్రజల మద్యకు వెళ్ళేందుకు మొహం చెల్లకపోవడం లేదా అహం అడ్డొస్తుండటం వంటి కారణాలతో మూడు ప్యాలస్‌ల మద్య తిరుగుతున్నారేమో? లేదా వైసీపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే పనిలో బిజీగా ఉన్నారో ఏమో?