jagan-paawan-kalyan-chandrababu-naidu

ఏ పోటీలో అయినా ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోక తప్పదు. కానీ ఏపీ రాజకీయాలలో జగన్‌ ఓడిపోగా మిగిలిన అందరూ గెలవడమే విశేషం. అందరూ కలిసి కట్టకట్టుకొని తనపైకి దండయాత్ర చేస్తున్నారని జగన్‌ ఆక్రోశించారే తప్ప వారందరూ తన వల్లనే ఏకమయ్యారని జగన్‌ గ్రహించలేదు.

Also Read – జగన్‌కి గులక రాయి, ట్రంప్‌కి బుల్లెట్… ఎంతైనా అగ్రరాజ్యం కదా?

సొంత తల్లిని, చెల్లిని కూడా తాను దూరం చేసుకుంటే, భిన్న దృవాల వంటి టిడిపి, జనసేన, బీజేపీలు తమ బేషజాలను, పంతాలు పట్టింపులు అన్నిటినీ పక్కన పెట్టి చేతులు కలిపాయనే విషయం కూడా జగన్‌ గ్రహించలేదు.

తాను ఎంచుకున్న సంక్షేమ విధానాన్ని నమ్మినంతగా జగన్‌ మరి దేనిని నమ్మలేదనే చెప్పాలి. అందుకే ఆ విధానం సరికాదని ప్రతిపక్షాలు, మీడియా హెచ్చరిస్తున్నా వాటిని ‘ఎల్లో రంగు’లోనే చూశారు తప్ప ప్రమాద ఘంటికలుగా భావించలేదు. ఒకవేళ గ్రహించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితిలో ఉండేవారే కారు కదా?

Also Read – రాజకీయ షల్టర్ కావలెను..!

కానీ జగన్‌ భస్మాసురుడిలా తనను తాను, తన పార్టీని, తననే నమ్ముకున్న నేతలను, లక్షలాది కార్యకర్తలని, తనకు అండగా నిలిచిన అధికారులను చివరికి వాలంటీర్ల భవిష్యత్‌ కూడా భస్మం చేసేశారు.

ఈ మోహినీ-భస్మాసుర డ్రామాలో సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, ఐప్యాక్, ఆరా మస్తాన్ వంటి అనేక మంది మోహినులు జగన్‌కు తోడ్పడ్డారు. ఇంతమందిలో ఏ ఒక్కరూ జగన్‌కు సరైన సలహా చెప్పలేదా?అంటే చెప్పేందుకు ప్రయత్నించే ఉంటారు. కానీ తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించేవాడికి ఎవరూ నచ్చజెప్పలేరు కదా?

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

జగన్మోహన్‌ రెడ్డి తాను నీతి నియమాలు పాటించే ధర్మరాజునని, అడక్కుండానే ప్రజలకు డబ్బులు పంచిపెట్టే దాన కర్ణుడునని, పద్మవ్యూహం ఛేదించగల అర్జునుడిననే అనుకున్నారు తప్ప అహంభావంతో సర్వం కోల్పోయేందుకు సిద్దపడిన దుర్యోధనుడినని ఏనాడూ అనుకోలేదు.

ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన్న నిలిచి పోరాడిన కురువృద్ధులతో పాటు, శకుని, శల్యుడు వంటివారు కూడా ప్రాణాలు కోల్పోయిన్నట్లే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో జగన్‌కి శల్యసారధ్యం చేసిన సజ్జల, ఐప్యాక్, ఆరా మస్తాన్‌లతో సహా వైసీపి సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోయింది.

జగన్‌ తన సైన్యాన్ని స్వయంగా నిర్వీర్యం చేసేసుకుని యుద్ధానికి వస్తూ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు సర్వశక్తులు కూడగట్టుకొని యుద్ధభూమిలో అడుగుపెట్టేలా చేశారని చెప్పవచ్చు. కనుక వారి గెలుపులో కొంత క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్‌ రెడ్డికి కూడా దక్కుతుంది.

జగన్‌ తన అదృష్టాన్ని ఎలాగూ గుర్తించలేకపోయారు. కనీసం దురదృష్టాన్ని కూడా గుర్తించలేకపోయారు. ఎటువంటి బలమైన కారణమూ లేకుండా భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం అదృష్టమనుకుంటే, ఎంతో ముచ్చటపడి వందల కోట్లు ఖర్చు చేసి ఋషికొండపై నిర్మించుకున్న విలాసవంతమైన భవనంలో ఒక్కసారి కాలుపెట్టకుండానే అధికారం కోల్పోవడం దురదృష్టమే కదా?

ప్రజావేదికని కూల్చివేసినందుకు పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు కోసమే దానిని కట్టించి అప్పగించిన్నట్లు ఉంది కదా?