Jagan Prepared for the Padayatra With Two Excuses

వైనాట్ 175 అని ప్రగల్భాలు పలుకుతూ జగన్‌ తన పార్టీ నేతలను మభ్యపెడుతూ ఎన్నికల వరకు తీసుకువెళ్ళారు. వారిలో సగం మందిని ఎన్నికలకు ముందే పక్కన పడేశారు.

‘మాది విన్నింగ్ టీమ్.. నేను సిద్ధం… మేమంతా సిద్ధం…’ అంటూ వందల కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రమంతా పోస్టర్స్ వేయించుకున్నారు. కానీ చివరికి బోర్లా పడ్డారు.

Also Read – కేసీఆర్‌ మౌనం: రేవంత్‌ స్థాయి సరిపోదా?

కనుక ప్రజలు తమని తిరస్కరించారని వైసీపి నేతలందరూ గ్రహించారు. కానీ జగన్‌ కూడా గ్రహించినా అంగీకరించలేక ఈవీఎంలని, ప్రజలని, కేంద్రాన్ని, టిడిపి, జనసేన, బీజేపీలని నిందిస్తున్నారు. జగన్‌ వంటి అహంభావం కలిగిన వ్యక్తి తమ ఓటమిని అంగీకరించడం కష్టమే.

కానీ అవతలివారి గెలుపుని రాష్ట్రంలో అన్ని వర్గాలు ఏదో పండుగ అన్నట్లు జరుపుకోవడం చూస్తున్నప్పుడైనా ప్రజలు తన పాలనను ఎంతగా అసహ్యించుకున్నారో జగన్‌ అర్ధం చేసుకుని ఉంటే శకుని, శిశుపాలుడు అంటూ తనకు సరిపడని పురాణాలు మాట్లాడేవారు కారు.

Also Read – ఒకే ఒక్క పధకంతో రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌కి చెక్?

కానీ ‘వైనాట్ 175?’ అంటూ పార్టీలో అందరి కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళి గోతిలో పడేసిన జగన్‌, ‘మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని’ చెపుతూ మరోసారి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఇంకా వయసు అయిపోలేదని త్వరలోనే తాను పాదయాత్ర చేస్తానని పార్టీ శ్రేణులను ఊరడించే ప్రయత్నం చేశారు.

ఆనాడు తండ్రి వైఎస్సార్ చనిపోయినప్పుడు ఓదార్పుయాత్ర చేసిన్నట్లు, ఇప్పుడు మరణశయ్యపై ఉన్న వైసీపి కోసం పాదయాత్ర చేయబోతున్నారని అనుకోవచ్చు.

Also Read – మీడియాని ప్రక్షాళన చేయాలంటే మొదట సాక్షితోనే…

అయితే వైఎస్సార్ మృతిపట్ల ప్రజలలో సానుభూతి ఉండేది కనుక ఓదార్పు యాత్ర ఫలించింది. కానీ వైసీపిని, జగన్మోహన్‌ రెడ్డిని ప్రజలే వద్దని తిరస్కరించినప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వారి దగ్గరకు వెళతారు? వెళ్ళి ఏమని చెపుతారు?

సంక్షేమ పధకాల పేరుతో మీ అందరికీ 5 ఏళ్ళు డబ్బు పంచాను కానీ నాకు ఎందుకు ఓట్లు వేయలేదు?నన్ను ఎందుకు మోసం చేశారు? అని ప్రజలను అడుగుతారా?చంద్రబాబు నాయుడుకి నాలాగ పాలన చాతకాదని చెప్పుకు తిరుగుతారా?

అలా చెప్పుకున్నా ప్రజలు మూసిముసి నవ్వులు నవ్వుతుంటే భరించడం చాలా కష్టం. కనుక పాదయాత్రకు రెండు సాకులు సిద్దం చేసుకుంటున్నారు. 1. ఎన్నికలలో ఓడిపోయినందుకు సానుభూతిని, 2. వైసీపి నేతలు, కార్యకర్తలపై టిడిపి దాడుల అంశం.

ఇదివరకు చంద్రబాబు నాయుడు జగన్‌ని, వైసీపిని చాలా ఉపేక్షించారు. కానీ ఈసారి ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఒకవేళ ఆయన ఉపేక్షించినా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. కనుక జగన్‌ పాదయాత్రలో అడుగడుగునా ప్రతిఘటనలు, అవరోధాలు, సవాళ్ళు, అవమానాలు తప్పకపోవచ్చు.

బహుశః జగన్‌ కూడా ఇలాగే జరగాలని తద్వారా మళ్ళీ ప్రజలలో తనపై సానుభూతి కలుగుతుందని ఆశిస్తుండవచ్చు. దాని వలన జగన్‌కు ఇప్పటికిప్పుడు లాభం కలుగకపోవచ్చు. కానీ ఆయన చేతిలో బలమైన మీడియా ఉంది కనుక తనకు వ్యతిరేకంగా జరిగే ప్రతీ చర్యని దాని ద్వారా హైలైట్ చేసి చూపించుకోగలరు.
ముఖ్యంగా జనం సానుభూతి సంపాదించుకోవడంలో జగన్‌కున్న నేర్పుని తక్కువగా అంచనా వేయడానికి లేదు. కనుక టిడిపి కూడా చాలా నేర్పుగా జగన్‌ని ఎదుర్కోవలసి ఉంటుంది.