Jagan's Rentapalla Tour Raises Tensions

ఇంతకాలం జగన్‌ పరామర్శ యాత్రలు జేజేలు పలికించుకొని, ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడానికే పరిమితంగా ఉండేవి. కానీ ప్రకాశం జిల్లా, పొదిలి పర్యటన మాత్రం వాటికి భిన్నంగా వైసీపీ శ్రేణుల దాడులతో ఫ్యాక్షన్ రాజకీయాలను గుర్తు చేసింది.

Also Read – పరామర్శకు తలకాయలు.. రాజకీయాలకు మామిడి కాయలు!

ఆ దాడులలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అది కొనసాగుతుండగానే రేపు (బుధవారం) పొదిలి కంటే గట్టిగానే వైసీపీ ఏదో చేసేందుకు సిద్దమవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలంలో రెంటపాల గ్రామంలో వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్‌ బయలుదేరుతున్నారు. సుమారు 30 వేల మందితో జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్ సుధీర్ భార్గవరెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకి వినతిపత్రం ఇచ్చారు.

Also Read – నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది.. పరువు కూడా!

కానీ విగ్రహావిష్కరణ జరుగుతున్న ప్రాంతంలో రోడ్‌ వెడల్పు పది అడుగులు మాత్రమే ఉన్నందున, అంతమందికి అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ చెప్పారు. జగన్‌ కాన్వాయ్‌లో రెండు కార్లకు, ఆయనతో సహా కేవలం 100 మందిని మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు.

అంతకు మించి ఎక్కువ మంది వస్తే అడ్డుకుంటామని, ఎవరైనా రెంటపాల గ్రామంలో ప్రవేశించాలని ప్రయత్నించినా, దౌర్జన్యం చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Also Read – కొడాలి విషయంలో కూటమి మనసులో ఏముంది.?

కానీ జగన్‌ వెంట వచ్చేవారిని పోలీసులు అడ్డుకుంటే ప్రజాస్వామ్యానికి విఘాతం అంటారు.. అడ్డుకోకపోతే పొదిలి పర్యటనలా విధ్వంసం సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శలు గుప్పిస్తారు.

ఒకవేళ రేపు రెంటపాల గ్రామంలో కూడా వైసీపీ శ్రేణులు రాళ్ళ దాడులు చేస్తే జగన్‌ గేర్ మార్చి ఇకపై ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నట్లు అనుమానించక తప్పదు.

ఇందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలనే పట్టించుకునేవారు కారు. కార్యకర్తల వల్ల ఉపయోగం లేదనుకునే వాలంటీర్లని నియమించుకున్నారు. కానీ ఇప్పుడు ఓ కార్యకర్త విగ్రహావిష్కరణకు వస్తున్నారంటే ఆ కార్యకర్తపై అభిమానంతోనా? లేక విగ్రహావిష్కరణ పేరుతో అల్లర్లు సృష్టించేందుకా? ఆలోచించాల్సిన విషయమే!




కనుక జగన్‌ పర్యటనలు ఇకపై పోలీసులకు, ప్రభుత్వానికి కూడా చాలా తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవిదంగా రాష్ట్రంలో పదేపదే అల్లర్లు జరుగుతుంటే సిఎం చంద్రబాబు నాయుడు పేరు, కూటమి ప్రభుత్వం ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ అన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కనుక జగన్‌కి ప్రజాస్వామ్య పద్దతులు నేర్పించడం చాలా అవసరమే!