Jubilee Hills By Election Litmus Test For KTR

జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఎన్నికలలో గెలుపు కోసం అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు.

ఈ ఏడాది డిసెంబర్ లోగ ఈ ఉపఎన్నిక ఎప్పుడైనా జరిగే అవకాశం ఉండడంతో ఎవరికీ వారు తమ పార్టీ పట్టు నిలుపోకవడానికి, ప్రజలలో తమ బలం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కావడంతో మిగిలిన పార్టీలకన్నా బిఆర్ఎస్ కు ఈ విజయం అత్యంత కీలకం కానుంది.

Also Read – టీడీపీ శ్రేణుల ధర్మాగ్రహం…

అలాగే బిఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి ఈ నాటి వరకు గత ఏడాదిన్నర కాలంగా బిఆర్ఎస్ పార్టీకి అన్ని తానే అయ్యి పార్టీని నడిపిస్తున్న కేటీఆర్ కు కూడా ఈ ఉప ఎన్నికలు అగ్ని పరీక్ష వంటిది. ఇన్నాళ్లుగా కేసీఆర్ నాయకత్వ నీడలో ఎదిగిన కేటీఆర్ గత కొద్దీ కాలంగా కేసీఆర్ అజ్ఞాతంలో ఉండడంతో పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.

దీనితో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ ప్రస్థానం గాడిన పడాలి అంటే ఈ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపు అనివార్యమనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది అన్నట్టుగా బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఎలాగూ ఉంటుంది

Also Read – మామిడి రైతుల సమస్యలకు బదులు జగన్‌ హంగామా హైలైట్!

కాబట్టి ఈ ఉప ఎన్నికలు బిఆర్ఎస్ కు, కేటీఆర్ కు జీవన్మరణ సమస్యగా మారనుంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఎన్నికలు కావడంతో ఆయన సతీమణి కే ఆ సీటు దక్కేఅవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనీసం సానుభూతి అస్త్రం కూడా బిఆర్ఎస్ ను కాపాడలేకపోతే రానున్న భవిష్యత్ కాలంలో బిఆర్ఎస్ రాజకీయంగా అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే గతంలో కూడా ఇదే మాదిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానంలో ఉపఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎవరు ఊహించని విధంగా మూడో స్థానానికి దిగజారింది. ఆ ఎన్నికలలో కూడా మృతి చెందిన కుటుంబంలోని అభ్యర్థికే (సోదరి) కే బిఆర్ఎస్ సీటును కేటాయించినా ఫలితం మాత్రం శూన్యం.

Also Read – పరామర్శకు తలకాయలు.. రాజకీయాలకు మామిడి కాయలు!

ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ కు ఇవే పరిస్థితులు ఎదురైతే ఇక ఆ పార్టీ GHMC ఎన్నికల మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే నాడు GHMC ఎన్నికల విజయంలో బిఆర్ఎస్ కి MIM మద్దతు ఉండడంతో ఆ గెలుపును బిఆర్ఎస్ సునాయాసంగా అందుకోగలిగింది.




కానీ నేడు MIM నుంచి బిఆర్ఎస్ కు మద్దతు లేకపోవడానికి బదులు వారు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనితో ఈ సారి GHMC ఎన్నికలలో బిఆర్ఎస్ హవా కొనసాగుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తున్తున్నాయి. కాబట్టి బిఆర్ఎస్ కారు భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి, కేటీఆర్ నాయకత్వ నిరూపణకు ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది.