Kalvakuntla Kavitha Comments

టీడీపీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ నినాదంతో తెరాస పార్టీని స్థాపించి టీడీపీ తో పొత్తులు పెట్టుకుని మరి ఎన్నికలలో పాల్గొన్నారు. అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేలా సాగిన పరిణామాలలో తెరాస, టీడీపీ కి ప్రత్యర్థి పార్టీగా మారిపోయింది.

అయితే ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత కూడా ఈ రెండు పార్టీల మధ్య కొంతకాలం రాజకీయ వైరం కొనసాగినప్పటికీ ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గా కాస్త సయోధ్య వాతావరణంలో ముందుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానికి అమరావతికి పునాదులు వేసే కార్యక్రమానికి కూడా బాబు కేసీఆర్ ను ఆహ్వానించి తన స్నేహ హస్తాన్ని అందించారు బాబు.

Also Read – కోటి సభ్యత్వాలు: ఎన్టీఆర్‌కి ఇదే కదా నివాళి?

అయినా కూడా కేసీఆర్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరాన్నే కోరుకున్నారు అనేలా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి బాబు మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి సారి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా.? అంటూ తెలంగాణ నినాదాన్ని రెచ్చకొట్టి తెలంగాణలో టీడీపీ పార్టీని పూర్తిగా తొక్కి పెట్టారు.

ఇటు టీడీపీ కి కూడా తెలంగాణ రాజకీయాలను సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లగలిగే నాయకుడు లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో టీడీపీ మెల్లి మెల్లిగా కనుమరుగవుతూ వస్తుంది. అయినా కూడా కేసీఆర్ కుటుంబానికి చంద్రబాబు మీద ద్వేషం మాత్రం తగ్గడం లేదు.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఇటు ఏపీ టీడీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కానీ, బిఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఏనాడూ విమర్శలు చేసిందే లేదు. అలాగే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ పాలనా విధానాల మీద కానీ పొగడ్తలు గుప్పించింది లేదు.

అయినా ఇప్పటికి బిఆర్ఎస్ ముఖ్యనేతలైన, కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, కానీ కవిత కానీ బాబు మీద తమ విషం కక్కుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే నెపంతో అటు కేటీఆర్ చిట్టి నాయుడు అంటూ సంబోధించిడం, మీ గురువు వల్లే కాలేనిది నీ వల్ల అవుతుందా.? అంటూ ప్రశ్నించడం బాబు మీద వారికున్న ద్వేషాన్ని బయటపెడుతోంది.

Also Read – కుమారస్వామికి అలా పుణ్య ఫలం దక్కింది!

ఇక తాజాగా తెలంగాణ రాజకీయాలలో మొదలైన తెలంగాణ తల్లి విగ్రహ మార్పు వివాదం మీద స్పందించిన కవిత కూడా కేటీఆర్ మాదిరే రేవంత్ కు కౌంటర్ వేసే ప్రక్రియలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు.

ఉద్యమాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల జోలికి రాకండి, అలా వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీ గురువు చంద్రబాబు కు తెలుసు, కనీసం ఆయను చూసి అయినా నేర్చుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు.అసలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకి ఏపీ ముఖ్యమంత్రి బాబుకి ఉన్న సంబంధం ఏమిటో కవిత చెప్పగలరా.?

కేసీఆర్ కుటుంబ సభ్యులు, బిఆర్ఎస్ ముఖ్య నేతలు పదేపదే సీఎం చంద్రబాబు మీద పరోక్ష విమర్శలు చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు వాటిని చూసి చూడక వదిలేస్తున్నారు. దీనినే కేసీఆర్ ఫ్యామిలీ అలుసుగా తీసుకుని బాబు మీద అనవసర విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్, కవితల ఇంత నిష్ఠురపు విమర్శలకు కారణం జగన్ మీద ఉన్న అంతులేని ప్రేమా.? లేక బాబు మీద ఉన్న అమితమైన ద్వేషమా.?




దీనికి ఇక్కడితో అయినా టీడీపీ నేతలు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతే రేపు రాబోయే కాలంలో బిఆర్ఎస్ తిరిగి ఏపీ రాజకీయాలలోకి చొరబడి టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకు వచ్చే ప్రమాదం లేకపోలేదు. నాటి వైసీపీ అరాచకాలకు, నేటి బిఆర్ఎస్ తెగింపుకు బాబు అలసత్వమే కారణం. దానికి టీడీపీ మూల్యం చెల్లిస్తుంది.