BRS Party Creating Problem For Andhra Pradesh Projects

ఓటమి నైరాశ్యం, అధినేత మౌనం, పార్టీలోని కుటుంబ రాజకీయాలు, కేసుల వలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల అలజడి ఇలా బిఆర్ఎస్ మొత్తం ఒక రాజకీయ పద్మ వ్యూహం లో చిక్కుకుని అల్లాడుతోంది.

ఇటువంటి సమయంలో ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటకు రావడానికి బిఆర్ఎస్ ఎంచుకున్న కవచం ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రోజెక్టుల పై బిఆర్ఎస్ మొదలు పెట్టిన రాజకీయ ఉచ్చులో చివరికి ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ కూడా చిక్కుకోక తప్పలేదు.

Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!

బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది అంటూ తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావు వేసిన విత్తనం, నానాటికి విస్తరిస్తూ ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసే స్థాయికి చేరుకుంది. బిఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలుపుకోవడానికి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఒక ఆక్సిజన్ మాదిరి వినియోగించుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ పై విష ప్రచారం బిఆర్ఎస్ రాజకీయంలో ఒక అంతర్ భాగమైపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదలుకుని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్సీ కవిత వరకు తమ రాజకీయ లబ్ది కోసం, వారి వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద, ఏపీ ప్రభుత్వ నిర్ణయాల పైన తెలంగాణ అనే సెంటిమెంట్ పూత పోసి గులాబీ కారుకి పెట్రోల్ తయారు చేస్తున్నారు.

Also Read – జగన్‌, చంద్రబాబు: ఎవరి ఉచ్చులో ఎవరు పడ్డారు?

గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ తో సద్వినియోగం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న ఈ తరుణంలో అది ఏపీ ప్రభుత్వ దుస్సాహసం, తెలంగాణ నీటి హక్కుల పై ఏపీ పెత్తనం అంటూ హరీష్ నుంచి రేవంత్ వరకు తెగ హంగామా చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఏపీలోని పోలవరం మీద రాజకీయ విష ప్రచారానికి సిద్ధమయ్యారు బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్సీ కవిత. ఏపీకి జీవనాడి, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణం తెలంగాణ లోని భద్రాద్రికి కు ప్రమాదమంటూ కవిత కొత్త రాగం అందుకున్నారు. పోలవరం నిర్మాణం అనేది ఇపుడు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు.

Also Read – టీటీడీలో అన్య మతస్తుల సేవలు తప్పవా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలవరానికి పునాది పడింది. కానీ అప్పటి ప్రభుత్వాల అలసత్వం, ఇప్పటి పార్టీల రాజకీయాల ఫలితంగా పోలవరం ఇప్పటికి పూర్తి కాలేకపోయింది. అయితే ఎప్పుడో పునాది వేసుకున్న పోలవరం మీద కవిత ఇప్పుడు తన సొంత కుంపటికి పునాదులు తవ్వాలని చూడడం ఆమె అవివేకమే అవుతుంది.

పోలవరం స్పిల్ వే సామర్ధ్యాన్ని 50 లక్షల క్యూసెక్కుల కు పెంచడం వల్ల తెలంగాణ కి బ్యాక్ వాటర్ సమస్య ఉత్పన్నమవుతుందని, దాని ఫలితంగా భద్రాచలం లోని రాముల ఆలయం మునిగిపోయే ప్రమాదం ఉంది అంటూ కవిత పాత సీసాలో కొత్త పచ్చడి పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా నిత్యం బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలలో తమ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఆయువుని హరిస్తున్నారు. గతంలో వైసీపీ తో తెరచాటు బంధాన్ని ఏర్పాటు చేసుకుని అమరావతి సమాధికి సాయమందించి ఏపీ భవిష్యత్ ని అంధకారంలోకి నెట్టారు.

ఇక ఇప్పుడు టీడీపీ మీద ఉన్న రాజకీయ వైరంతో, బాబు మీద ఉన్న ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ నీటి ప్రోజెక్టుల నిర్మాణాల పై నిప్పురాచేస్తూ ఆ మంటలో బిఆర్ఎస్ కు తిరిగి జీవం పొసే ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై కేసీఆర్ కుటుంబ చేసే రాజకీయం చూస్తున్నా, బిఆర్ఎస్ పార్టీ అంటున్న విమర్శలు వింటున్నా బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాల్సిందేనా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విభజన జరిగి పదేళ్లు పూర్తి అయిన బిఆర్ఎస్ కు ఏపీ పై ఏపీ ఎదుగుదల పై ఎందుకింత కక్ష్య.? అన్న ప్రశ్న ప్రతి ఆంధ్రుడి మదిలో మెదులుతుంది.

బిఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం తమ నీటి రాజకీయాలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరాలు సృష్టించి తద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు మరోసారి విభజన రేపిన గాయాలను, అప్పటి వైషమ్యాలను, విద్వేషాలను గుర్తు చేయాలనీ బిఆర్ఎస్ ప్రయత్నిస్తుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.




తెలంగాణలో గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం మీద కూడా ఏపీ ప్రభుత్వం కనీసం విమర్శ కూడా చెయ్యలేదు. కానీ ఏపీ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రతి ప్రాజెక్ట్ మీద, చివరికి పోలవరం వంటి జాతీయ జాతీయ ప్రయోజెక్టులను సైతం బిఆర్ఎస్ తప్పుబడుతూ ఏపీ పై అనవరసమైన రాద్ధాంతం చేస్తుంది.