Kavitha To Invite Students To Telangana Jagruthi Party

కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకున్నప్పుడు కేసీఆర్‌ తల ఎత్తుకోలేకపోయారు. ఇది వరకు మహారాణిలా జీవించిన ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌ తండ్రి మనసు ఎంతగా కుమిలిపోయిందో అర్దం చేసుకోవచ్చు.

కానీ ఇప్పుడు ఆ కూతురే తన వైఖరిని విమర్శించి, తన చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయంటూ చేసిన ఆరోపణలతో అపర చాణక్యుడిననుకున్న కేసీఆర్‌ తల కొట్టేసినట్లవుతోంది కదా?

Also Read – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మూడు స్తంభాలాటేనా.?

పైగా ఆమె తెలంగాణ జాగృతి పేరుతో చేస్తున్న హడావుడి బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తోంది. అందుకే ఇటీవల ఆమె తనని పరామర్శించేందుకు భర్తతో కలిసి ఫామ్‌హౌస్‌కి వచ్చినప్పుడు కేసీఆర్‌ ఆమె వైపు కనీసం చూడలేదు కూడా.

కనుక తన దారి తాను చూసుకోక తప్పదని గ్రహించిణ కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టారు.

Also Read – రేవంత్ తన మార్క్ చూపించబోతున్నారా.?

కానీ ఈరోజు ఆమె ముక్కు పచ్చలారని కాలేజీ విద్యార్ధులకి జాగృతి కండువాలు కప్పి పార్టీ(?)లో చేర్చుకోవడం చూస్తే ఎవరైనా నవ్వుకోకుండా ఉండలేరు.

చిన్న ఫ్లాష్ బ్యాక్: లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నుంచి నోటీస్ అందుకోగానే, చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ అంశాన్ని భుజానికెత్తుకున్న కవిత, తిహార్ జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ‘సామాజిక న్యాయం’ అంశాన్ని భుజానికెత్తుకున్నారు.

Also Read – త్రిమూర్తులు ప్రత్యక్షం.. కానీ వరం కోరుకోలేదు!

అంటే పదేళ్ళ తండ్రి పాలన మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగలేదని, నేటికీ బిఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డ (తనకు) న్యాయం జరుగలేదని ఆమె చెపుతున్నట్లే కదా?

నాడు కేసీఆర్‌ చెప్పిన ‘గుణాత్మకమైన మార్పు’, ఇప్పుడు ఆమె చెపుతున్న ‘సామాజిక న్యాయం’ బ్రహ్మ పదార్ధాల వంటివే. కనుక ఇప్పుడు వాటి ఆది అంతం వెతకడం అనవసరం!

మళ్ళీ వర్తమానంలోకి వస్తే, ఆమె వంటి రాజకీయ పరిణతి కలిగిన రాజకీయ నాయకురాలు ఈరోజు పార్టీ (?)లో చేరిన పిల్లలని పక్కన పెట్టుకొని బీసీ రిజర్వేషన్స్ మాట్లాడిన మాటలు విన్నప్పుడు, ఈ లెక్కన ఆమె రాజకీయాలలో ఒంటరిగా నెగ్గుకు రాగలరా?అనే సందేహం కలుగక మానదు.

బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేసి, ఢిల్లీకి పంపి చేతులు దులుపుకున్నారని, కానీ బీసీ రిజర్వేషన్స్ అమలు చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతామంటే చూస్తూ ఊరుకోబోమని కవిత హెచ్చరించారు.

గతంలో ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల రిజర్వేషన్ శాతం పెంచుతూ ఇలాగే శాసనసభలో తీర్మానం చేసి, ఢిల్లీకి పోస్టు బాక్సులో వేసి చేతులు దులుపుకున్నప్పుడు “డాడీ రిజర్వేషన్స్ రాకపోతే ఎన్నికలకు వెళ్ళవద్దు.. వెళ్తే నే ఒప్పుకోను..” అని అనలేదు. కానీ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు.

రిజర్వేషన్స్ పెంపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే లేదని తెలిసి ఉన్నా నాడు ముస్లింల రిజర్వేషన్ పెంపు పేరుతో కేసీఆర్‌ ముస్లిం (ఓటు బ్యాంక్)ను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన కూతురు బీసీలను ఆకట్టుకోవడానికి అదే చేస్తున్నారు.

కానీ ఓ పక్క బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. వస్తే వాటిలోనైనా సత్తా చాటుకుని, మళ్ళీ గాడిన పడాలని ఆశపడుతుంటే ఆ ఎన్నికలని అడ్డుకుంటామని కవిత హెచ్చరిస్తున్నారు.




నేటికీ ‘కల్వకుంట్ల’ టైటిల్‌ వదులుకోకుండా ఆ పేరుతోనే రాజకీయాలు చేస్తూ, ‘సామాజిక న్యాయం’ జరగలేదని గొంతు చించుకొని ఏం ప్రయోజనం?కల్వకుంట్ల అనే మర్రి చెట్టు నీడలో తెలంగాణ జాగృతి అనే కుంపటిపై రాజకీయ పాయసం వండుకు తినడం సాధ్యమేనా? ఇలా అయితే రాజకీయాలలో ఎలా నెగ్గుకు రాగలవు అక్కా?