
“నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు.. చాలా గట్టిగానే ఉంటుంది. మామూలుగా దెబ్బ కొట్టే అలవాటు నాకు లేదు,” అని కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన ఏవిదంగా రాజకీయాలు చేస్తుంటారో మరోసారి స్పష్టం చేశాయి.
Also Read – సనాతన మార్గంలో పవన్ ప్రయాణం తమిళనాడుకే
తన దారికి అడొస్తే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లేదా తెలంగాణ ఉద్యమాలలో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ లేదా ఈటల రాజేందర్ కావచ్చు… ఎవరినైనా చాలా నిర్ధాక్షిణ్యంగా అడ్డుతొలగించుకుంటారు. అందుకోసం వారిని గట్టిగా దెబ్బతీయడానికి వెనకాడలేదు.
కేసీఆర్ ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం వల్లనే ఆయనకు రాజకీయాలలో శత్రువులు పెరిగారు. ఆ కారణంగానే శాసనసభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్నారు. కానీ నేటికీ తన ధోరణి మారలేదని తాజా వ్యాఖ్యలతో చాటుకున్నారు.
Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?
దాదాపు ఏడాదిగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోయారు. కానీ అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో కూల్చేయాలని అనుకున్నారు. కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల ద్వారా అదే మాట చెప్పించారు.
వారు అలా బెదిరించడం వల్లనే రేవంత్ రెడ్డి జాగ్రత్తపడుతూ 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయారు.
Also Read – అయ్యో! మన హిస్టరీ అంతా అలా చెప్పేస్తున్నారేమిటి?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ప్రభుత్వానికి ప్రమాదం ఏర్పడిందంటూ, బంగారి తెలంగాణ సాధన కోసం అంటూ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలు తన పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే అదే చేశారు కదా?అంటే కేసీఆర్ వల్లనే పార్టీ మరింత బలహీనపడిందని అర్దమవుతోంది.
కానీ రేవంత్ రెడ్డి చేసింది అనైతికం, అప్రజాస్వామ్యం అంటూ తన ఎమ్మెల్యేల చేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. కనుక న్యాయస్థానం దానిపై విచారణ చేపట్టి సంజాయిషీ ఇవ్వాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శిని కోరింది.
దాదాపు ఏడాదిగా ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. కనుక సుప్రీంకోర్టులో ఈ కేసుని ప్రస్తావిస్తూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని అందరూ సిద్దంగా ఉండాలని కొడుకు కేటీఆర్ ద్వారా చెప్పిస్తున్నారు.
ఆయన కూడా ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయని, వాటిలో బిఆర్ఎస్ అభ్యర్ధులు గెలుపు ఖాయమని నిన్న జోస్యం చెప్పారు.
త్వరలో జరుగబోతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ అభ్యర్ధులను నిలబెట్టలేకపోయారు కానీ అసలు జరుగుతాయో లేదో తెలీని శాసనసభ ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్ధులను ప్రకటిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో?
కేసీఆర్ రాజకీయాలలోకి రావాలనుకుంటే ఆయనకు సరిపడా ఆరోగ్యం, ఓపిక ఉండాలి తప్ప ఎవరికీ అభ్యంతరం లేదు. ‘నువ్వొస్తానంటే నేను వద్దంటానా..’ అని సిఎం రేవంత్ రెడ్డి రోజూ పాట పాడుతూనే ఉన్నారు కూడా.
కానీ కేసీఆర్ రీ-రిలీజ్ కోసం ఉప ఎన్నికల ఈవెంట్ జరగాలని కోరుకోవడం, జరుగుతాయని నమ్మబలుకుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?