
రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరు. ఈ విషయం అపర చాణక్యుడు కేసీఆర్‌కి తెలియదనుకోలేము. కానీ ఆయన ఓటమి తర్వాత ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది.
కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో అంటకాగేవారు. ఆ కారణంగా రాష్ట్రంలో బీజేపి విమర్శలకు అర్దం లేకుండా చేశారు. దాని విశ్వసనీయతని ప్రశ్నార్ధకంగా మార్చారు. కానీ ఆ తర్వాత హటాత్తుగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూయడం మొదలుపెట్టారు. ఆ విదంగా కూడా తెలంగాణ ప్రజలను ఆకట్టుకొని రాష్ట్రంలో బీజేపివైపు మొగ్గకుండా అడ్డుకోగలిగారు.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
కానీ ఢిల్లీ లిక్కర్ స్కాములో కూతురు కవిత తిహార్ జైల్లో గడుపుతుండటంతో కేంద్రంతో రాజీపడి విడిపించుకున్నారు. అందుకు ప్రతిగా మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ధరణి కేసులతో కల్వకుంట్ల & కోకు ఉచ్చు బిగిస్తుండటంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పట్ల మెతకవైఖరి తప్పలేదు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
అందుకే 25వ గులాబీ సభలో కేసీఆర్ ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనలేదు. కానీ అది తప్పని ఆయన కూతురు కవితే తండ్రికి ఓ లేఖ వ్రాశారు!
అంటే బిఆర్ఎస్ పార్టీ వెనక్కు తగ్గకుండా కేంద్రంతో యుద్ధం చేస్తుండాలని ఆమె సూచిస్తున్నట్లు అర్దమవుతోంది. కానీ కేంద్రంపై మళ్ళీ కత్తులు దూస్తే లిక్కర్ ఒలికే ప్రమాదం ఉంటుందని, అందుకే తండ్రి కేసీఆర్ బీజేపి, కేంద్ర ప్రభుత్వం విషయంలో ‘సైలంట్ మోడ్’కి షిఫ్ట్ అయ్యారని ఆమెకు తెలియదనుకోలేము.
Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!
ఓ పక్క ఆమె ఉత్తరం తెలంగాణలో రాజకీయ దుమారం సృష్టిస్తుంటే, మరో పక్క కాళేశ్వరం కేసులో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఆయనకు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినందుకు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేంద్రంపై కత్తులు దూయడం మొదలుపెట్టింది.
కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. కాళేశ్వరం విషయంలో కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ, పోలవరం విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని దాని సారాంశం.
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావులకి కమీషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ, వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోలేదనే ధైర్యం బిఆర్ఎస్ పార్టీకి ఉందనే విషయం కేటీఆర్ మాటలతో స్పష్టం అవుతోంది. కాళేశ్వరం కాకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదీ కాకపోతే ఎఫ్-1 రేసింగ్ కేసు.. ఏదో ఓ కేసులో చిక్కుకుని జైలుకి వెళ్ళే పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు, కేంద్రంతో సఖ్యతగా ఉంటే రక్షణ లభిస్తుందని తెలిసి ఉన్నప్పుడు, కాళేశ్వరం పేరుతో కేంద్రంపై కత్తులు దూస్తే ఎవరికి నష్టం?
ఒకవేళ కాళేశ్వరం కేసుని సిఎం రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పగించేస్తే కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? అని ఎవరూ ఆలోచించినట్లు లేదు.
ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు కేంద్రంతో అణిగిమణిగి ఉండాలా లేక కవిత సూచిస్తున్నట్లు మళ్ళీ కత్తులు దూయాలా? అనే డైలమా బిఆర్ఎస్ పార్టీలో కనబడుతోంది.