KCR Jagan

కేసీఆర్‌, జగన్‌ ఇద్దరిలో కొన్ని కామన్ అవలక్షణాలు ఏమిటంటే అన్నీ మాకు మాత్రమే తెలుసనే అహంభావం. ఆ భ్రమలో ఉంటూ అందరినీ భ్రమింపజేయాలని ప్రయత్నిస్తుండటం. అందరినీ శత్రువులుగా మార్చుకొని వారితో పోరాటాలు చేస్తూ, మళ్ళీ అదేదో ఘన కార్యమన్నట్లు బిల్డ్ అప్‌ ఇచ్చుకోవడం.

ఈ అవలక్షణాల కారణంగానే వారికి చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ల మౌనం, వినయం చాతకానితనంగా కనపడింది. అందుకే వారి గురించి అంత చులకనగా మాట్లాడారు. అదే… కేసీఆర్‌ మౌనంగా ఉంటే అది కూడా ఏదో ఘనకార్యమే అన్నట్లు బిఆర్ఎస్ నేతలు అభివర్ణించుకునే వారు.

Also Read – రోజా రోజమ్మ…ఆనాటి హగ్గులు ఏవమ్మా..?

ఈ అవలక్షణాల కారణంగానే తిరుగేలేదనుకున్న ఇద్దరూ ఎన్నికలలో దారుణంగా ఓడిపోగా, ఓపిక, సంయమనం పాటించడం, అందరినీ కలుపుకుపోవడం వంటి లక్షణాల కారణంగా చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ విజయం సాధించగలిగారు.

రాష్ట్ర ప్రజలందరూ మావెంటే ఉన్నారని కేసీఆర్‌, జగన్‌ వారు గొప్పలు చెప్పుకుంటే, అదే ప్రజలు వారిని తిరస్కరించి మూల కూర్చోబెట్టి, రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు అధికారం కట్టబెట్టారు.

Also Read – నిర్మలమ్మ హల్వాలో ఏపీకి ఎంతో?

నారా లోకేష్‌ తన లోపాలు, తప్పులు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఓడిన మంగళగిరిలోనే గెలవగా, కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ తమ తప్పులను, లోపాలను, వైఫల్యాలను అంగీకరించకుండా తిరిగి ప్రజలను, ఎవరెవరినో నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి కూడా అహం అడ్డొస్తే వారిని, ముఖ్యంగా వారినే నమ్ముకున్నవారిని ఆ భగవంతుడు కూడా కాపాడడు.

ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అదే శాసనసభలో చంద్రబాబు నాయుడుని జగన్‌ అవమానించారు కనుక ఇప్పుడు కేవలం 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని జగన్‌ శాసనసభ సమావేశాలకు హాజరవుతారని ఎవరూ అనుకోవడం లేదు. మరి ఏం చేస్తారు?అంటే ఓసారి కేసీఆర్‌ని చూడాల్సి ఉంటుంది.

Also Read – ప్రజల మద్యకు రావడానికి కూడా హింస అవసరమా?

తెలంగాణలో శాసనసభ సమావేశాలు నిర్వహించినప్పుడు కేసీఆర్‌ మొహం చాటేశారు. తుంటి ఎముక సాకుతో రెండు నెలలు తప్పించుకున్నప్పటికీ మూడోసారి సమావేశాలకు వెళ్ళి ఉండవచ్చు. కానీ బహిరంగ సభలలో, మీడియా సమావేశాలలో సింహంలా గర్జించే కేసీఆర్‌, శాసనసభ సమావేశాలకు రమ్మనమని రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు పదేపదే సవాలు చేస్తున్నా వెళ్ళకుండా మొహం చాటేస్తున్నారు.

కనుక జగన్‌ కూడా శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతూ, కేసీఆర్‌లాగా తన ఓటమికి కుంటి సాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేయవచ్చు. లేదా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలుచేయడం లేదంటూ బిఆర్ఎస్ నేతలు తిరుగుతున్నట్లే, ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా హామీలు అమలుచేయడం లేదంటూ ఏదో పేరుతో కార్యక్రమాలు చేపడుతారేమో?

కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే అక్కడ కేసీఆర్‌ మెడకి కేసులు చుట్టుకుంటున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ కేసీఆర్‌కు నోటీస్ పంపింది. ఈ నెల 30న కమీషన్ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాలని కోరింది. గొప్ప మేధావి అనుకున్న కేసీఆర్‌ పరిస్థితి ఇలా ఉంటే, మూడు రాజధానులు కనిపెట్టిన మరో మేధావి జగన్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెలికి తీసే అవినీతి, అక్రమాల కేసులు బోనస్ అని చెప్పవచ్చు.

కనుక ఏవిదంగా చూసినా కేసీఆర్‌, జగన్‌ అంతా ‘సేమ్ టూ సేమ్‌’ అనే అనిపిస్తుంది.