KCR, Jagan Mohan Reddy, Arvind Kejriwal Tragedy Story

ఒక్క ఓటమి మూడు పార్టీలకు రాజకీయ ఉనికిని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. అలాగే ముగ్గురు అధినేతలకు ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బిఆర్ఎస్ 2023 ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా ఓటమిని చవి చూసింది.

అలాగే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికి ప్రజాక్షేత్రంలోకి రాలేకపోతున్నారు. అయితే తన పదేళ్ల అధికారంతో తెలంగాణలో మరో రాజకీయ పార్టీ జాడ కనిపించకుండా, మరో పార్టీ నాయకుడు పేరు వినపడకుండా, రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ప్రజా తీర్పునూ ఒప్పుకోలేకపోతున్నారు.

Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!

దీనితో పార్టీ ఒక్కసారి ఓటమిని ఎదుర్కొనగానే ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా అధికార పార్టీ కండువాలతో బిఆర్ఎస్ అధినేత కు ఓటమిని మించిన అవమానాన్ని చూపించారు. ఇక ఇదే దోవలో పయనిస్తూ చేతిలో అధికారాన్ని పెట్టుకుని ఐదేళ్లు ఏపీని విధ్వంశం దిశగా నడిపిస్తూ పాతికేళ్ల రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వైసీపీని ఓటమి పలుకరించగానే పార్టీ చెల్లాచెదురయ్యింది.

151 సీట్లతో 2024 లో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ వై నాట్ 175 అంటూ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాగే బాబు ని అరెస్టు చేసి టీడీపీ పార్టీని భూస్థాపితం చెయ్యడానికి ప్రణాళికలు వేసింది. జనసేన, టీడీపీ పొత్తు కుదరకూడదని కుయుక్త రాజకీయాలతో అలుపెరుగని పోరాటం చేసింది. అయినా ప్రజా తీర్పుని మార్చలేకపోయి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకు పరిమితమయ్యింది.

Also Read – ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!

దీనితో పార్టీలోని ముఖ్య నేతలందరూ సాయి రెడ్డి తో సహా వైసీపీకి రాజీనామా చేసి జగన్ రాజకీయానికి ఓ దండం పెట్టి తప్పుకుంటున్నారు. ఇక దేశ రాజధానిలోనే పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కున్న తొలిసారే ఢిల్లీ గద్దె మీద ఆప్ పార్టీ తన జెండాను ఎగరేసింది. అలాగే తన అజెండాతో ఢిల్లీ ప్రజలను మెప్పించింది. దీనితో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను పక్కకునెట్టి రెండవసారి కూడా హస్తినలో పాగా వేయగలిగింది ఆప్.

అయితే కాంగ్రెస్ పార్టీకి దూరమయి, స్కాములకు దగ్గరై, పాలన పక్కన పెట్టి, అవినీతికి చేరువై, పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటకట్టుకుని, ముఖ్యమంత్రిగా ఉంటూ జైలుకెళ్లిన ఆప్ అధినేత కేజ్రీవాల్ తనకు ప్రజల నుండి సానుభూతి వస్తుందని ముచ్చటగా మూడోసారి కూడా దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని స్థాపించి దేశంలో అశ్వమేధ యాగం చేస్తున్న బీజేపీ పార్టీ గెలుపు గుర్రానికి కళ్లెం వేయాలని ఆశించారు.

Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!

అయితే బీజేపీ పార్టీ ఓటమి సంగతి అటుంచితే చివరికి ఆప్ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రి గా కేజ్రీవాల్ ని కూడా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. పార్టీ ఓటమితో పాటుగా పార్టీ అధినేత కూడా ఓడిపోతే ఇక ఆ రాజకీయ పార్టీ తన ఉనికిని కోల్పవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అందునా బీజేపీ వేసే రాజకీయ పద్మవ్యూహాలను తట్టుకుని ఆప్ ఢిల్లీలో నిలబడగలుగుతుందా.? అనే సందేహాలు అప్పుడే పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి.

అయితే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ ముందుండి నడపగలరు. లేకుంటే హరీష్ రావు తన పవర్ రాజకీయాలను చూపించి బిఆర్ఎస్ ని తిరిగి నిలబెట్టను గలరు. ఇక ఏపీలో వైసీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వైసీపీకి వర్తమానం, భవిష్యత్ రెండు కూడా జగనే కావడం, ఆ జగన్ మీద పదుల సంఖ్యలో అవినీతి కేసులుండడంతో జగన్ జైలుకెళ్తే వైసీపీ కథ సమాప్తం కావచ్చు.




ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు మోస్తూ జైలు నుంచి బైలు మీద బయటకొచ్చారు. అయితే ఇక్కడ ప్రజా కోర్ట్ లో కూడా కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన క్రమంలో ఇక ఆ పాత కేసులు తిరిగి కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంటే, ఆప్ రాజకీయానికి ముగింపు పలికినట్టే అవుతుంది. దీనితో ఒక్క ఓటమి మూడు పార్టీల రాజకీయ ‘కథను’ మార్చి..ముగ్గురు అధినేతలకు మానసిక ‘వ్యధనే’ మిగిల్చిందని చెప్పాలి.