brs-kcr

చింత చచ్చినా పులుపు చావలేద్దన్నట్లు తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఓడిపోయినా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తీరు ఏమాత్రం మారలేదు.

Also Read – రాష్ట్రపతి పాలనకు జగన్‌ డిమాండ్: వింటున్నారా బాబూ?

ఆయన హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ విచారణ జరుపుతోంది. జూన్ 15లోగా విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వవలసిందిగా కమీషన్ నోటీస్ పంపించింది. కానీ కేసీఆర్‌ ఆ నోటీసును పట్టించుకోకపోగా, కమీషన్ బాధ్యతల నుంచి మీరే తప్పుకుంటే మంచిదంటూ ఘాటుగా లేఖ వ్రాశారు!

“నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్సంక్షోభం నెలకొని ఉండేదనే సంగతి బహుశః మీకు కూడా తెలిసే ఉంటుంది. అయినా నేను దోషినని నిరూపించేందుకే తెలంగాణ ప్రభుత్వం మీ కమీషన్ ఏర్పాటు చేసింది.

Also Read – బాధ్యతకు…బరితెగింపుకు వ్యత్యాసం..!

మీరు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నేను దోషినని నిర్ధారించేసిన్నట్లు మాట్లాడారు. కనుక మీతో నేను ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. మీరు సక్రమంగా విచారణ జరపలేనప్పుడు కమీషన్ నుంచి తప్పుకుంటే మంచిది,” అంటూ కేసీఆర్‌ లేఖ వ్రాశారు.

అవినీతి ఆరోపణలపై సంజాయిషీ చెప్పుకోమని కమీషన్ నోటీస్ పంపిస్తే, కమీషన్ నుంచి మీరే తప్పుకోండని కేసీఆర్‌ బదులు ఇవ్వడం గమనిస్తే ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని అర్దమవుతోంది.

Also Read – అప్పుడు వద్దనుకున్న రాజ్యాంగమే అవసరం పడిందిప్పుడు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో టిడిపి, జనసేనలు తమ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని తప్పులు సరిదిద్దుకు మళ్ళీ అధికారంలోకి రాగలిగాయి.

ముఖ్యంగా తెలంగాణలో రేవంత్‌ రెడ్డి, ఏపీలో నారా లోకేష్‌ ఇద్దరూ అనేక అవమానాలు, అవహేళనలు భరించి, ఎదురుదెబ్బలు తిని రాటు తేలారు. ఇద్దరూ తమ ఓటమి పాఠాలు నేర్చుకొని తమను తాను తీర్చిదిద్దుకొని ఎన్నికలలో ఘన విజయం సాధించారు. అంతకు మించి అటు ప్రజలలోను, ఇటు పార్టీలోను ఆధరణ సంపాదించుకున్నారు. రాజకీయాలలో రాణించాలనుకునే ప్రతీ ఒక్కరికీ వారి పోరాటస్పూర్తి ఆదర్శప్రాయం.

కానీ రెండు పార్టీలకు అధినేతలుగా ఉన్న జగన్, కేసీఆర్‌ ఇద్దరూ తమ తప్పులను, లోపాలను కనీసం అంగీకరించడానికి కూడా ఇష్టపడటం లేదు. తమ వైఫల్యాలకు ఎదుటవారినే నిందిస్తూ ఈవిదంగా అహంభావం ప్రదర్శిస్తున్నారు.
ఇక్కడ ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి అహంభావం వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ తెలంగాణలో కేసీఆర్‌ అహంభావం వలన బిఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే దుస్థితికి చేరుకుంది. పాము తన పిల్లలను మింగేసిన్నట్లుగా వారి అహంభావమే వారి పార్టీలకు, వారిని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల పాలిట శాపంగా మారుతున్నాయని చెప్పవచ్చు. కేసీఆర్‌, జగన్‌ ధోరణి మారదని స్పష్టం అవుతోంది కనుక రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు పెద్దగా శ్రమపడకుండానే వారిరువురూ తమ పార్టీలను స్వయంగా నిర్వీర్యం చేసేసుకుంటారేమో?