తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో “అభివృద్ధి.. కాళేశ్వరం ప్రాజెక్టు, నభూతో నభవిష్యత్… పాలాభిషేకాలు, కాంగ్రెస్‌, బీజేపీ, మోడీ వేస్ట్… దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే” మాటలు ఎక్కువగా వినపడేవి.

అయితే తెలంగాణ అభివృద్ధి మాటున కేసీఆర్‌ చిలకొట్టుడు చాలా ఉందని రేవంత్‌ రెడ్డి కాగితాలు తీసి చూపిస్తున్నారు. అది వేరే కధ.

Also Read – వినుకొండకు జగన్‌: ఓదార్పుకా… శవ రాజకీయాలకా?

ప్రస్తుతం ‘సింగరేణి’ బొగ్గు గనులు నిప్పు లేకుండానే భగభగమని మండుతున్నాయి.

దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గు గనిని కూడా వేలంపాట వేయడం… దానిలో సింగరేణి కూడా పాల్గొనడమే.

Also Read – మీడియాని ప్రక్షాళన చేయాలంటే మొదట సాక్షితోనే…

దీంతో అలవాటు ప్రకారం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌, బీజేపీలపై యుద్ధం ప్రకటించేసింది. కానీ పాత లెక్కలు చూసుకోకుండా యుద్ధభేరి మ్రోగించేయడం చాలా రాంగ్ అని కాస్త ఆలస్యంగా ఆగ్రహించింది.

“కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రయివేటీకరణ కాకుండా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని కానీ కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అమ్మేస్తున్నాయంటూ” కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

Also Read – వైసీపిలో అందరూ భస్మాసురులేనా?

దీంతో కాంగ్రెస్‌, బీజేపీలు కూడా పాత లెక్కలు బయటకు తీసి, “2021లో తెలంగాణలోని బొగ్గు గనులు వేలంపాటలో సింగరేణిని పాల్గొననీయకుండా కేసీఆర్‌ అడ్డుకొని తన సన్నిహితులైన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన ‘ఆర్ కోల్’, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ (ప్రతిమా గ్రూప్)లకు అవి దక్కేలా చేసి, సింగరేణికి నష్టం కలిగించారు. ఇప్పుడు సింగరేణి కోసం మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు,” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విక్రమార్క తెర వెనక కధ చెప్పేశారు.

బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్‌ గురించి మరో కధ చెప్పారు. “కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో మితిమీరిన జోక్యం చేసుకుంటూ, దాని ఆస్తులను కరిగించేశారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో సింగరేణి లాభాలను కూడా పక్కదారి పట్టించారు. సింగరేణి అధికారులని పావులుగా చేసుకొని రాజకీయాలు చేశారు.

సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49% కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%. మరి అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఏవిదంగా ప్రయివేటీకరణ చేయగలదు? కానీ సింగరేణి ప్రయివేటీకరణ పేరుతో రాజకీయాలు చేశారు. సింగరేణిని బిఆర్ఎస్ పార్టీకి ఓ రాజకీయ వేదికగా కేసీఆర్‌ ఉపయోగించుకున్నారు.

బొగ్గు గనుల వేలంవలన రాష్ట్ర ప్రభుత్వానికే రాయల్టీ రూపంలో ఆదాయం వస్తుందని తెలిసినా రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో వేలంపాటని వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌, ఒడిశాలో వేలంపాటకు సింగరేణిని ఎందుకు అనుమతించారు?ఎందుకంటే ఇక్కడ అసమదీయులున్నారు అక్కడ లేరు గనుక,” అని కిషన్ రెడ్డి మాటల సారాంశం. అంటే కేసీఆర్‌ చేతికి సింగరేణి మసి అంటుకుందనే కదా అర్దం?