Kethireddy Venkatarami Reddy

ఇంతకాలం నువ్వే మా నమ్మకం జగన్‌ అని భజన చేసిన వైసీపి నేతలే ఇప్పుడు ‘మా భవిష్యత్‌ మటాష్ చేశావుగా జగన్’ అని ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు.

Also Read – ఏపీలో కమల ‘వికాసం’ సాధ్యమా.?

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ తొలి రాగం ఆలపించారు. తమ ప్రభుత్వం (అనాలోచిత) నిర్ణయాలు (అనుచిత) విధానాలకు రిఫరెండమే ఈ ప్రజాతీర్పు అని సింపుల్‌గా తేల్చి చెప్పేశారు.

ప్రతీరోజూ తెల్లవారగానే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ అంటూ పలకరించే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌ అపాయింట్మెంట్ లభించక రోజంతా పడిగాపులు కాయడం, అనుభవించిన అవమానాల గురించి వివరిస్తూ ఫస్ట్ ఎపిసోడ్ మొదలుపెట్టారు.

Also Read – బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందా?

ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మేమేమీ మా సొంత పనుల కోసం జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు వెళ్ళలేదు. నా నియోజకవర్గంలో గుంతలు పడిన రోడ్ల మరమత్తులకు అనుమతులు, నిధులు మంజూరు చేయమని కోరేందుకు వెళ్ళాను. ధర్మవరంలో ఓ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి భూసేకరణ విషయమై మాట్లాడేందుకు వెళ్ళాను.

కేవలం ఈ రెండు పనుల కోసమే నేను కనీసం ఓ వందసార్లు తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్ళి ఉంటాను. వెళ్ళినప్పుడల్లా అక్కడ నాలాగే జగన్‌ని కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తుండటం కళ్ళారా చూశాను.

Also Read – పనిచేస్తున్న ప్రభుత్వంపై ప్యాలస్‌లో కూర్చొని విమర్శలా!

ఎన్ని గంటలైనా జగన్‌ నుంచి పిలుపు రాకపోవడంతో మాలో చాలా బాధ, అసహనం కలిగేవి. ఓ ప్రజా ప్రతినిధికి ఇంతకంటే అవమానం ఏముంటుంది? కానీ మా బాధ ఎవరికీ చెప్పుకోలేము. అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు రోజూ మమ్మల్ని నిలదీస్తూనే ఉన్నారు. కానీ ఎవరికీ సమాధానం చెప్పుకోలేక అందరం చాలా సతమతమయ్యే వాళ్ళం.

సీఎంవోలో ఉన్న కొందరు అధికారులే మాకూ, మా అధినేతకు మద్య ఈ గ్యాప్ సృష్టించారు. ఎన్నికలు సమీపించేసరికి ఆ గ్యాప్ ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. చివరికి ఆ గ్యాప్ మా పార్టీని ముంచేసింది. ఇప్పుడు మా పార్టీ ఓటమికి సీఎంవో అధికారులు బాధ్యత వహించగలరా?” అని కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి ప్రశ్నించారు.

తాడేపల్లి ప్యాలస్‌లో అవమానాలు మరియు వైసీపి ఓటమికి కారణాలలో ఇది ఫస్ట్ ఎపిసోడ్ కనుక ఇలాంటి ఎపిసోడ్స్ త్వరలో మరిన్ని చూడబోతున్నాము.