ysrcp-kodali-nani

ఈసారి ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం పాలవడంతో వైసీపి నేతలందరూ చాలా రోజులు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. తేరుకున్నాక తమ పరిస్థితి ఏమిటనే భయాందోళనలు మొదలయ్యాయి. కానీ వారికి తమని నిలువునా ముంచేసిన జగన్‌ని నమ్ముకోవడం తప్ప మరో దారిలేదు.

కనుక మళ్ళీ గుడ్డిగా జగన్‌ డైరెక్షన్‌లో ముందుకో, వెనక్కో, జైలుకో వెళ్ళేందుకు మానసికంగా సిద్దం అవుతున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా ఫామ్‌లోకి వచ్చేశారు.

Also Read – జగన్‌కి గులక రాయి, ట్రంప్‌కి బుల్లెట్… ఎంతైనా అగ్రరాజ్యం కదా?

ఋషికొండ ప్యాలస్‌ గురించి గుడివాడ, పోలవరం గురించి అంబటి రాంబాబు, ఈవీఎంలు, ఓటింగ్ శాతం గురించి రోజా గలగలా మాట్లాడేసి తమకున్న పరిజ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టేశారు.

ఇప్పుడు బూతుల మంత్రిగా ఫేమస్ అయిన కొడాలి నాని కూడా ఫామ్‌లోకి వచ్చేశారు. దీనికి ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ ‘జగన్‌ నివాసంలో ఫర్నీచర్‌.’

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

ఈరోజు గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ, “ముష్టి ఫర్నీచర్ ఎవడికి కావాలి? తీసుకుపొమ్మని చెపుతున్నాము కదా? వద్దంటే ఎంత ఇవ్వాలో చెపితే మొహాన్న కొడతాం. ఎవడికి కావాలి తొక్కలో ఫర్నీచరు? వాటిని జగన్‌ ఏమన్నా సాక్షి కార్యాలయానికి తరలిచారా లేదే?

ఒకడు కెమెరాలు పట్టుకువెళ్ళి బాత్రూములు, లేట్రిన్లలో దూరి కమోడ్‌లు, బాత్ టబ్బులని ఫోటోలు తీసి జగన్మోహన్‌ రెడ్డి 30 లక్షల పెట్టి కొన్నాడు అంటూ వాగుతుంటాడు. అదేమన్నా జగన్‌ సొంత ఇల్లా? ప్రభుత్వం కోసమేగా కట్టించింది? జగన్‌ వైజాగ్‌లో ఉండాలనుకుంటే అక్కడ సొంతంగా ఇల్లు కట్టించుకునే వెళతాడు,” అంటూ కొడాలి నాని ఆవేశపడ్డారు.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

మరో ప్రశ్నకు సమాధానంగా, “టిడిపి నన్ను టార్గెట్ చేసుకున్నంత మాత్రన్న నాకేమీ భయం లేదు. నేను ఉన్నా పోయినా జగన్మోహన్‌ రెడ్డి ఉన్నంత కాలం మా పార్టీ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ చెపుతున్నా… ఈ టిడిపివాళ్ళు మా జగన్‌ వెంట్రుకని కూడా పీకలేరు,” అని కొడాలి నాని అన్నారు.

కొడాలి నాని ఇప్పుడు దేనిని ‘ముష్టి ఫర్నీచర్’ అంటున్నారో దానినే జగన్‌ ఇంతకాలం వాడుకున్నారు. ఇంకా వాడుకుంటూనే ఉన్నారు. దాని కోసం లక్షలో కోట్లో ప్రజాధనం ఖర్చు చేశారు కూడా.

ఆనాడు దివంగత శాసనసభ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్ కూడా ఇలాగే తన వద్ద ఉన్న ఫర్నీచర్ వివరాలు స్వయంగా మీడియా ద్వారా ప్రకటించి, వాటిని జగన్‌ ప్రభుత్వనికి అప్పగించడానికి సిద్దపడ్డారు. ఒకవేళ వద్దనుకుంటే దాని ఖరీదు చెల్లించేందుకు ఆయన సిద్దమయ్యారు కూడా.

కానీ జగన్‌ ప్రభుత్వం ఆయనపై ఫర్నీచర్ దొంగ అనే ముద్రవేసి వేధించింది. అంత సీనియర్ నాయకుడుని ఆత్మహత్య చేసుకునే అంతగా వేధిస్తున్నప్పుడు కొడాలి నానితో సహా వైసీపిలో ఎవరికీ తప్పుగా అనిపించలేదు. పైగా అలాంటి బలమైన నాయకుడు అడ్డు తొలగిపోయిందని సంతోషించారు.

తెలంగాణలో ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, ఇటీవల రామోజీరావు చనిపోతే అక్కడి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి హుందాగా వ్యవహరిస్తోంది. కానీ వైసీపి నేతలు కోడెల శివప్రసాద రావుని ఆత్మహత్య చేసుకునే వరకు వేధించారు. చనిపోయిన తర్వాత కూడా కనీస గౌరవం ఇవ్వలేదు.

ఇప్పుడు సరిగ్గా అదే సీన్ తమ నాయకుడికి రిపీట్ అవుతుంటే వైసీపి నేతలకు మింగుడు పడటం లేదు. ఆనాడు తాము కోడెల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించామో గుర్తుకు రావాలి కానీ కొడాలి నానికి ఆవేశం వస్తోంది!వైసీపి నేతలు చేసిన తప్పులు, పాపాలకు పర్యవసానాలు, ప్రాయశ్చిత్తం తప్పదు కదా?

ఏది ఏమైనప్పటికీ కొడాలి నాని మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినందున మీడియాకి, టిడిపి నేతలకి, ప్రజలకి అందరికీ బోలెడంత కాలక్షేపం లభిస్తుంది.